కనగల్, మార్చి 25 : నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు తప్పకుండా తమ పిల్లలను చదివించాలని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించామని, అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగ్ నిర్మించి మొదటి అంతస్తు పూర్తి చేశామని, అక్కడ మహిళలకు కూడా శిక్షణ ఇస్తున్నామని, సెట్విన్ ద్వారా 2,500 మంది మహిళలకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని, అంతేకాక రూ.80 కోట్ల వ్యయంతో ఏటీసీ కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని, వీటన్నిటి ద్వారా చదువుకున్న యువత స్వయం ఉపాధి పొందవచ్చని మంత్రి తెలిపారు.
రహదారుల అభివృద్ధిలో భాగంగా నల్లగొండ నుండి దర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయడం జరిగిందని, ధర్వేశిపురం నుండి గుర్రంపోడు మీదుగా రూ.180 కోట్లతో చేపట్టే రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. కనగల్ చౌరస్తా నుండి అసంపూర్తిగా ఉన్న రహదారిని సరిచేసేందుకు రూ.8 కోట్లు మంజూరు చేశామని, శుక్రవారం నుండి పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అలాగే రేగట్టే వరకు రూ.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, పగిడిమర్రి మీదుగా మరో రోడ్డు ముశంపల్లి వరకు రూ.100 కోట్లతో రోడ్డును మంజూరు చేసినట్లు వెల్లడించారు.
కనగల్ మండల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి తెలిపారు. రూ.8 కోట్లతో పునుగోడు లిఫ్ట్ ఇరిగేషన్, కాంచనపల్లి, రేగట్ట లిఫ్ట్ ఇరిగేషన్లు చేపట్టడం జరిగిందని, మొత్తం రూ.50 కోట్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.1.20 కోట్లతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో రూ.16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని, ఏప్రిల్ మొదటి వారంలో కనగల్ లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి కనగల్ అభివృద్ధికి అవసరమైన చర్యలపై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బి.చంద్రశేఖర్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.