– పర్సంటైల్ పాలనగా ప్రజా పాలన
– ఎస్ఎల్బీసీ కూలితే బాధ్యులపై చర్యలేవి
– ఎన్ని డ్రామాలు చేసిన చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుంది
– నల్లగొండలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా పాలన కాస్తా కమీషన్ల పాలనగా మారిందని, ఇదంతా వారి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు చెబుతున్నదేనన్నారు. కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం కుప్పకూలితే ఇప్పటికీ శవాలను తీయలేక పోయారని విమర్శించారు. కనీసం దానికి బాధ్యులు ఎవరో కూడా తేల్చలేకపోయారన్నారు. ఇవ్వన్నీ కప్పి పుచ్చుకోవడానికి వారు తమకు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లా తెలిపోవడం ఖాయమన్నారు.
బుధవారం నల్లగొండలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత 17 నెలలుగా పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వమిది అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రతీ పనిలో వసూలు చేస్తున్న కమీషన్ల మీద నేడు రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుందన్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వచ్చి 20%, 30% కమీషన్లు తీసుకుంటున్నారంటూ ధర్నాలు చేసింది నిజం కదా అని ఆయన ప్రశ్నించారు.
చివరకు ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమీషన్లు లేనిది, పైసలు లేనిది తమ ప్రభుత్వంలో పనులు కావడం లేదని బహిరంగంగానే చెబుతున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి నేటితో మూడు నెలలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ నల్లగొండ రైతులు, ప్రజల తరుపున రేవంత్ రెడ్డిని అడుగుతున్నానని, సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో సమర్ధవంతమైన సీఎం ఉండి ఉంటే మంగళగ్రామ్లో చిక్కుకుపోయిన మనుషులను సైతం అక్కడి నుంచి తెచ్చే వాళ్లు అని ఏద్దేవా చేశారు. కానీ వారి కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే అందులో చుక్కుకుపోయిన వారి శవాలను సైతం తీయలేకపోయారని మండిపడ్డారు. కనీసం ఆ పనుల్లో ఏమి
జరిగిందో చెప్పే పరిస్థితి లేదన్నారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు అందుకు కారణమైన సంస్థపై విచారణ లేదని, చర్యలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక వాట్టెం పంపుహౌస్ మునిగితే దానిపై చర్యలు లేవన్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్ రెండుసార్లు కొట్టుకుపోతే దాని మీద చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ను విఫల ప్రాజెక్ట్ గా ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నాయని, కానీ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసన్నారు. దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. కమిటీల పేరిట, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
420 హామీల అమలును పట్టించుకోవడం లేదని, ఇచ్చిన ప్రతీ హామీ అమలు కోసం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. రూ.4 వేల పెన్షన్ ఎప్పుడిస్తారని లబ్ధిదారులు అడుగుతున్నారని, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడబిడ్డలు, వాళ్ల తల్లిదండ్రులు అడుగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదన్నారు. వారు ఎన్ని నోటీసులు ఇచ్చినా, డ్రామాలు చేసినా ముమ్మాటికీ న్యాయం, ధర్మం గెలుస్తాయన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడుతాడన్నారు. 17 నెలల నుంచి ఎన్ని చిల్లర వేషాలు వేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. వారు త్రీడి మంత్రంగా భావిస్తున్న డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్ అనే ఆలోచన ఎక్కువ రోజులు నడవదన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు తిరగబడి స్కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Nalgonda : కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసుల డ్రామాలు : కేటీఆర్