Taapsee Pannu | సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2010లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘షాడో’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించారు. హిందీ చిత్రసీమలో మాత్రం తాప్సీ తన కెరీర్‌ను పూర్తిగా మలుచుకున్నారు. గ్లామర్ పాత్రలకు భిన్నంగా కథా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ముఖ్యంగా పింక్, నామ్ శభాన, థప్పడ్, ముల్క్ వంటి సినిమాలతో ఆమె నటిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకతగా మారింది. ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాపిడ్ ఫైర్ రౌండ్లో “మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీనా? లేక రాహుల్ గాంధీనా?” అనే ప్రశ్న ఎదురవ్వగా తాప్సీ నవ్వుతూ మోదీ ఫోటో వైపు చేతులు జోడించి నమస్కారం చేశారు. వెంటనే “నాకు ఇంకా ఈ దేశంలోనే ఉండాలని ఉంది” అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె చమత్కారాన్ని మెచ్చుకుంటూ స్మార్ట్‌గా హ్యాండిల్ చేసిందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఈ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అభిమానులు మాత్రం తాప్సీ ఎప్పటిలాగే బోల్డ్‌గా మాట్లాడిందని ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఇక గతంలో కూడా తాప్సీ టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో హీరోయిన్లకు సరైన ప్రాధాన్యం ఉండదని, మహిళా పాత్రలకు కథలో బలం తక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా “నేను ఇండియాలోనే ఉండాలనుకుంటున్నా” అన్న ఒక్క మాటతో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆమె కామెంట్స్‌పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.