Pochampally Srinivas Reddy | జనగామ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా కొనసాగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్ను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్ఈసీ మార్గదర్శకాల ప్రకారం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలని.. కానీ జనగామ మున్సిపాలిటీ పరిధిలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఓటు లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్అఫీషియో ఓటును పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ నిర్ణయాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్అఫీషియో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఈ రాజ్యాంగబద్ధమైన హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి నన్ను నామినేటెడ్ ఎమ్మెల్సీ/ఎంపీగా గుర్తిస్తూ ఓటు వేసే హక్కును కాలరాస్తూ కలెక్టర్ నన్ను తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లు ఓటు వేస్తేనే గెలిచిన నాకు.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓటు వేసే హక్కు ఉంటుందని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని అన్నారు.