Vijay – Rashmika | టాలీవుడ్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయని సినీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు “మేము కేవలం స్నేహితులమే” అంటూ పబ్లిక్‌లో స్పందించిన ఈ జంట, ఇప్పుడు నిజంగానే ఏడడుగులు వేయబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి వివాహం జరగబోతోందనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుందని ప్రచారం. ఫిబ్రవరి 26ను ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లిని ఎంత సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా వార్తలు లీక్ అవుతున్నాయి.
పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో సింపుల్‌గా జరగనుండగా, అసలైన హంగామా మాత్రం హైదరాబాద్‌లో ఉండబోతోందని సమాచారం. మార్చి 4న నగరంలోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారని ప్రచారం జరగడం ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో పెళ్లి ఖాయం అన్న చర్చ మరింత వేగం అందుకుంది.
ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అవుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రష్మిక–విజయ్‌లతో కలిసి పని చేసిన పలువురు దర్శకులు, టెక్నీషియన్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ‘గీత గోవిందం’ సినిమా నుంచే మొదలైన ఈ జంట కెమిస్ట్రీ ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లిగా మారబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, పెళ్లి ఖాయం అన్న నమ్మకంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. ఉదయ్‌పూర్ కోటలో జరిగే వేడుకల ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మరో స్టార్ జంటను తన ఖాతాలో వేసుకోబోతుందనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.