హాలియా, మార్చి 17 : హాలియాలో ప్రైవేట్ పాఠశాలల విద్యావ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవా భావంతో అందించాల్సిన విద్య నేడు అంగడి సరుకైనది. లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వారివల్ల, విద్య పూర్తిగా వ్యాపార మయంగా మారింది. 2026-26 విద్యాసంవత్సరం ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి హాలియాలోని ఒకటీ రెండు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పుడే పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.
విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరం మళ్లీ తమ పాఠశాలకు వస్తారో రారో అన్న అనుమానంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు మార్చి నెల ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు మళ్లీ తమ పాఠశాలకే వస్తారని, పుస్తకాలు కొనుగోలు చేయకపోతే తల్లితండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలకు పంపుతారనే అనుమానంతో ఒకటీ రెండు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పుటి నుంచే పుస్తకాలు విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే నర్సరీలో చేరేందుకే రూ.15వేలు వసూలు చేస్తున్నారు.
పట్టణ జనాభా 17వేలు. 12 వార్డుల్లో 12 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాక 3 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా వసతుల్లేవు. టాయిలెట్లు, తాగునీరు, క్రీడా మైదానాలు సక్రమం గా లేవు. సగానికి పైగా పాఠశాలలకు సొంత భవానాల్లేవు. అద్దె భవనాల్లో, రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. పైవేట్ క్లాసుల పేరుతో ఉదయం 6గంటలకే పాఠశాలకు రప్పించి, మళ్లీ సాయంత్రం 7 నుంచి 8గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాల్సిన విద్యార్థి సంఘాల నేతలు కూ డా ఈ విషయంలో నోరు మొదపడం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే చం దాలకు కక్కుర్తిపడి నోరుమెదపడంలేదు. వి ద్యాశాఖ, విద్యార్థి సంఘాలకు కండ్లు కనబడకపోవడం, చెవులు వినబడకపోవడంతో హాలియాలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
హాలియాలోని ఏ ప్రైవేట్ పాఠశాలకు కూడా సీబీఎస్సీ బోధించేందుకు అనుమతి లేదు. ఈ విషయాన్ని గతేడాది మండల విద్యాధికారి ప్రకటించారు. కానీ హాలియాలోని ఒకటి రెండు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలో సీబీఎస్సీ సిలబస్ బోధిస్తున్నామని బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను గుడ్డిగా ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. అలాగే విద్యాసంవత్సరం నడుస్తున్నా, ఫిబ్రవరి చివరికే సిలబస్ పూర్తి చేసి మార్చిలోనే వచ్చే విద్యాసంవత్సరంలో చెప్పాల్సిన తరగతులను ఇప్పుడే బోధించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించే తల్లిదండ్రులు కానీ, అధికారులు కానీ లేకపోవడం విచారకరం.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు నిర్వహించాలి. పాఠశాలలో పుస్తకాలు విక్రయించడం సరికాదు.. చట్టరీత్యానేరం. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు ఇప్పుడే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం, వారిపై వత్తిడి తేవడం సరికాదు. ఎవరైనా పుస్తకాలే కొనాలని డిమాండ్ చేస్తే మాకు పిర్యాదు చేయవచ్చు. హాలియాలో ఇప్పటి వరకు ఏ పాఠశాలకు సీబీఎస్సీ గుర్తింపు రాలేదు.
– శ్రీనయ్య, మండల విద్యాధికారి