నల్లగొండ, ఆగస్టు 17 : రైతులు వరికి బదులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సాంకేతిక సమస్యలతో రాష్ట్రంలో 10వేల నుంచి 12వేల మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని, వారందరికీ త్వరలోనే అందజేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో రైతుబడి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అగ్రిషోను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం మూడు విడుతల్లో 22లక్షల మందికి రూ.18వేల కోట్లు మాఫీ చేసిందన్నారు. రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు అదనపు సొమ్మును బ్యాంకులో చెల్లిస్తే వెంటనే రూ.రెండు లక్షలు వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రంగంలో ఇంకా నూతన మార్పులు, యాంత్రీకరణ రావాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని మూడేండ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. అగ్రి షోలో 90కి పైగా వ్యవసాయ అనుబంధ స్టాళ్లను ఏర్పాటు చేయగా, రైతులు పెద్ద సంఖ్యలో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
రైతు బడి నిర్వాహకుడు జూలకంటి రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.