సూర్యాపేట, మే 31 : సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్వహణ తీరుపై జిల్లా కలెరక్టర్ తేజస్ నందలాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిపై మాట్లాడుతూ యూజీడీ పనులు అత్యంత నిర్లక్ష్యంగా సాగుతున్నాయని మండిపడ్డారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, మ్యాన్‌హోళ్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి నెలలు దాటినా వాటికి సిమెంట్, కాంక్రీట్ చేయకుండా వదిలేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోందన్నారు. పైపులైన్లు, మ్యాన్‌హోళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే తవ్విన గోతులు పూడ్చకపోవడం ముమ్మాటికీ నిర్లక్ష్యమేనన్నారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు స్థానిక ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో నల్లగొండ ప్రజారోగ్య సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ ఈఈ కిరణ్‌కుమార్, ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఈఈ అనిల్‌కుమార్, రమాదేవి, కేఎన్ఆర్ కనక్షస్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.