హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఊహించిన ప్రమాదమే ఎదురైంది. నీటిహక్కులపై పొరుగు రాష్ర్టాలతో రేవంత్‌రెడ్డి సర్కార్ చేసుకొంటున్న ఒప్పందాలు ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలను నిర్వీర్యం చేస్తున్నాయి. నీటివాటాలపై తెలంగాణ డిమాండ్లకు విలువే లేకుండా చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీకే స్వయంగా అస్ర్తాలను అందిస్తున్న తీరుగా వ్యవహారం కొనసాగుతున్నది. అందు కు ఇటీవల తుంగభద్ర జలాలపై ఏర్పాటుచేసిన హైపర్ కమిటీయే దానికి నిదర్శనం కాగా, అందుకు సంబంధించిన పత్రాలను ట్రిబ్యునల్‌లో తనకు అనుకూలంగా ఏపీ సమర్పించింది.
ఆర్డీఎస్‌పై మన వాదనలన్నింటినీ కొట్టిపారేసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. తుంగభద్ర జలాల వినియోగ అంశంపై గత నెలలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలోనే కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయి, తుంగభద్ర జలాలపై వివాదాల పరిష్కార బాధ్యతను కేంద్రానికి ఏకపక్షంగానే కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ, కేంద్రజలసంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో మొత్తంగా 9 మందితో ఒక ఉన్నత స్థాయి కమిటీని 10రోజుల క్రితమే ఏర్పాటు చేసింది. అంతేకాదు తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్, రాజోలిబండ డైవర్షన్ సీమ్(ఆర్డీఎస్) ఆధునీరణ అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని, 6నెల్లలో నివేదిక సమర్పించాలని సైతం మార్గదర్శకాలను జారీ చేసింది.
సదరు కమిటీ భేటీ కాకముందే తన వాదనలకు మద్దతుగా ఏపీ సర్కార్ ఆ కమిటీని తాజాగా ట్రి బ్యునల్ వాదనల్లో ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తుంగభద్ర జలాల వినియోగంపై రాష్ర్టాల సమ్మతితో కేంద్రం కమిటీ వేసిందని ట్రిబ్యునల్‌కు వివరించింది. తన వాదనలకు మద్దతుగా కమిటీ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఏపీ ట్రిబ్యునల్‌కు సమర్పించడం గమనార్హం. గతంలో తెలంగాణ వాదనలన్నింటినీ ఏపీ ఈ సందర్భంగా వ్యతిరేకించింది. ఇదే విషయమై ఇప్పుడు తెలంగాణ నీటిరంగ నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తుంగభద్ర జలాల వినియోగంపై ట్రిబ్యునల్‌లో గతంలోనే తెలంగాణ తన వాదనలు వినిపించింది. ప్రధానంగా తుంగభద్ర రైట్ బ్రాంచ్ లోలెవల్ కెనాల్‌పై వాదనలు నివేదించింది. ఆవిరి నష్టాలు 5.50 టీఎంసీలు కలుపుకొని ఎల్ఎల్సీకి మొత్తంగా 29.50 టీఎంసీలను ట్రిబ్యునల్-1కు కేటాయించిందని, అంతేగాక శ్రీశైలం జలాశయానికి అత్యధిక మొత్తంలో వరద ప్రవాహాలు తుంగభద్ర నుంచే వస్తాయని, ఈ నేపథ్యంలో తుంగభద్రపై నీటి వినియోగాలకు ట్రిబ్యునల్-1 కర్ణాటక, ఏపీకి అనేక ఆంక్షలను విధించిందని గుర్తుచేసింది. అయినా ఏపీ వాటిని పట్టించుకోవడం లేదని తెలిపింది.
ఎల్ఎల్సీ ఆయకట్టు కోసమే ఆర్డీఎస్ కుడికాలువ, గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటు చేసిందని, కేటాయింపుల కంటే అదనపు జలాలను వినియోగించుకొంటున్నదని ట్రిబ్యునల్‌కు నివేదించింది. తద్వారా శ్రీశైలం జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గి, తెలంగాణ ప్రాజెక్టులకు విఘాతం ఏర్పడుతున్నదని, ఈ నేపథ్యంలో గురు రాఘవేంద్ర లిఫ్ట్ సీమ్ ద్వారా నీటిని వినియోగించుకొనేందుకు ఏపీకి అనుమతులు ఇవ్వొద్దని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది.
ఒకవైపు ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతుండగానే, సీఎం రేవంత్‌రెడ్డి పొరుగు రాష్ర్టాలతో చర్చలు నెరిపిన ఫలితంగా కేంద్ర జల్‌శక్తి శాఖ తుంగభద్ర జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే కమిటీని ఏపీ ట్రిబ్యునల్‌లో సమర్పించింది. దీంతో తెలంగాణ వాదనలన్నీ నిర్వీర్యమయ్యే దుస్థితి ఏర్పడిందని నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కమిటీని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణకు తీరని నష్టమని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
గతంలోనూ కృష్ణాజలాల వివాదాల పరిష్కారానికి ఏర్పాటుచేసిన కమిటీని ఆధారంగా చేసుకొని ఏపీ సర్కార్ తనకు అనుకూలంగా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించింద ని గుర్తుచేస్తున్నారు. దీంతో తెలంగాణ వాదనలకు బలంలేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వివాదంలోనూ సుప్రీంకోర్టు మొ ట్టికాయలు వేసిందని, చర్చలకు కమిటీ ఏర్పాటుచేసిన అనంతరం కోర్టుకు ఎందుకొచ్చారని నిలదీసిందని గుర్తుచేస్తున్నారు. భవిష్యత్తులో ప్రస్తుత కమిటీలు సైతం తెలంగాణ వాదనలకు గుదిబండగా మారే ప్రమాదం ఏర్పడింద ని, అంతా రేవంత్ సర్కార్ అత్యుత్సాహ ఫలితమేనని నిపుణులు నిప్పులుచెరుగుతున్నారు.
తుంగభద్ర జలాల వినియోగ అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం తొలిసారి భేటీ కానున్నది. ఢిలీల్లో సీడబ్ల్యూసీ కార్యాలయం నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ నేతృత్వంలో వర్చువల్‌గా ఈ భేటీ జరుగుతుంది. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలపై కమిటీ చర్చించనున్నది. హైలెవల్ కమిటీలో కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, సీడబ్ల్యూసీలోని 4 విభాగాల సీఈలు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, మెంబర్ సెక్రటరీతో కలిపి మొత్తంగా 9మంది సభ్యులుగా ఉన్నారు. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు.