అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 45 ఏళ్ల మధ్య వయస్కుడైన హీరోపై ఇష్టం పెంచుకునే ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి, వారి అనుబంధం నేపథ్యంలో వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి రెండోగీతం ‘ది వెడ్డింగ్ సాంగ్’ను విడుదల చేశారు.
జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటను హీరో సూర్య స్వయంగా ఆలపించడం విశేషం. ‘కన్నూ కన్నూ ఒక్కటిగా చేరంగా, చేతిలో చేయి వేసి సల్లాపాలే సాగంగా…చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా, అదిరే పెళ్లి కల జిగేల్ అనంగా, రంగ్‌బర్సే..కలలు మురిసే కాలం ఎదురవగా’ అంటూ పెళ్లి వేడుక తాలూకు సందడికి అద్దం పడుతూ ఈ పాట సాగిం ది. ఇందులో సూర్య, మమితాబైజు నృత్యాలు హైలైట్‌గా నిలిచాయి. మమితబైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.