హుజూర్నగర్, ఏప్రిల్ 23 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. గురువారం హుజుర్నగర్ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సమయం కాకముందే విధుల నుండి వెళ్లిపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ కేంద్రాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు విధి నిర్వహణలో సమయానికి రోగులకు అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఓపి విభాగంలో సమయపాలన పాటించని డాక్టర్లను, కాంట్రాక్టు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను అందించాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సాధారణ ప్రసవాలు అధికంగా జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పారిశుధ్య నిర్వహణపై శానిటేషన్ సిబ్బందిని, నర్సింగ్ ఆఫీసర్లను అభినందించారు. కాయకల్పలో అవార్డు పొందాలని ఆకాక్షించారు.మెరుగ్గా పారిశుధ్య పనులను నిర్వహించి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఓపి విభాగం, బ్లడ్ స్టోరేజి విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.
నూతనంగా నిర్మిస్తున్న ఓపి బ్లాక్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సిటీ స్కాన్ మిషన్ పని తీరును పర్యవేక్షించారు. టీ హబ్ నిర్వహణలో ఉన్న లోపాలను అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ, వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.