అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7గంటల నుంచి మొదలయ్యే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సామగ్రితో బుధవారం సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల్లో వారికి ర్యాండమైజ్ పద్ధతితో విధులు కేటాయించారు. వారంతా ఉదయం 5.30గంటల వరకు ఆయా ఆభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ చేసి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుపనున్నారు. ఇప్పటికే ఓటర్లందరికీ క్షేత్రస్థాయిలో బీఎల్ఓల ద్వారా పోల్ చిట్టీల పంపిణీ కూడా పూర్తయ్యింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ కోసం భారీగా పోలీసు బందోబస్తును కూడా వినియోగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,766 పోలింగ్ కేంద్రాల్లో 14,64,080 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇన్నాళ్లు విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా పోల్ మేనేజ్మెంట్పైనే దృష్టి సారించారు.
– నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, నవంబర్29(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో 14,64,080 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,26,169 మం ది, మహిళలు 7,37, 789 మంది, 122 మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు. 543 మంది సర్వీస్ ఓటర్లుగా ఉన్నారు. ఇక వయస్సుల వారీగా పరిశీలిస్తే… 18-19 యేండ్ల మధ్య ఓటర్లు 60,840 మంది ఉండగా 80 ప్లస్ సీనియర్ సిటిజన్లు 17,424 మంది, దివ్యాంగులు 32,007 మంది, ఓవర్ సీస్ ఓటర్లు 76 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలో 1766 పోలింగ్ కేంద్రా లు, 2 యాక్జిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిల్లో గ్రామీణ ప్రాంతాల్లో 1067, పట్టణ ప్రాంతాల్లో 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
అభ్యర్థుల సంఖ్య 144 మంది
నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 144 మంది బరిలో నిలిచారు. దేవరకొండలో 13, నాగార్జునసాగర్ 15, మిర్యాలగూడ 23, నల్లగొండలో 31, మునుగోడులో 38, నకిరేకల్‌లో 23 మంది అభ్యర్థ్ధులు పోటీలో ఉన్నారు. కాగా ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థ్ధులకే అవకాశం ఉండనుంది. ఈ ప్రకారంగా చూస్తే దేవరకొండ, నాగార్జునసాగర్‌లలో ఒక్కో బ్యాలెట్ యూనిట్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌లలో రెండు, మునుగోడులో మాత్రం మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఉన్న చోట్ల ఓటర్లు జాగ్రత్తగా తాము ఓటు వేయదలుచుకున్న అభ్యర్థిని వెతుక్కుని వేయాల్సి ఉంటుంది.
మోడల్ పోలింగ్ కేంద్రాలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు చొప్పున ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో నిర్వహించే పోలింగ్ కేంద్రాలు జిల్లాలో మొత్తం 30 ఏర్పాటు చేశారు. అదే విధంగా నియోజకవర్గానికి ఐదు చొప్పున మొత్తం 30 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున దివ్యాంగుల సిబ్బంది, మరొకటి యువత నిర్వహించేలా ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, మెడికల్ కిట్స్, వలంటీర్లు, ట్రాన్స్‌పోర్టు, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక కేంద్రాలు556
జిల్లాలో 336 ప్రాంతాల్లో 556 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వీటి పరిధిలోనే దేవరకొండ నియోజకవర్గంలో 13 షాడో పోలింగ్ కేంద్రాలు, మునుగోడు నియోజకవర్గంలో 9 షాడో కేంద్రాలు కలిపి మొత్తం 22 షాడో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంటుంది. ప్రత్యేక పోలీసు బలగాలతో పర్యవేక్షణ కొనసాగనుంది. ఇక పోలింగ్ రోజున జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం 1,177 పోలింగ్ కేంద్రాల్లో 1,555 సీసీటీవీలు ఏర్పాటు చేశారు.
8140 మంది పోలింగ్ సిబ్బంది
పోలింగ్ విధుల కోసం 8140 మంది సిబ్బందిని వినియోస్తున్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఒక్కో బృందం చొప్పున 1,768, రిజర్వ్‌లో మరో 1,068 బృందాలుగా సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీరితో పాటు మైక్రో అబ్జర్వర్లుగా 410 మంది, 1,766 మెడికల్ బృందాలు, 1,400 మంది వలంటీర్స్ సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. వీరు కాకుండా 3,079 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. వీరిలో ఏడుగురు డీఎస్పీలు, సీఐఈలు 15 మంది, ఎస్ఐలు 90 మంది, ఏఎస్ఐలు 308 మంది, కానిస్టేబుళ్లు 1,105 మంది, హెడ్ కానిస్టేబుళ్లు 1,739 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. వీరు కాకుండా మూడు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బలగాలు, 19 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీరంతా బుధవారమే తమ విధుల్లో చేరిపోయారు.
గుర్తింపుకార్డు తప్పనిసరి
ఓటరు తన ఓటు వేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డ్), ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు/తపాలా పాస్ బుక్, కార్మిక శాఖ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, భారతీయ పాస్ పోర్ట్, ఫొటో గల పెన్షన్ పత్రాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు ఇలా ఫొటో కూడిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఓటరు వెంట తీసుకెళ్లాల్సిందే.
కౌంటింగ్ కేంద్రానికి తరలింపు
సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంల అన్నింటిని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలకు తరలించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ముందుగా డిస్ట్రిబ్యూటరీ/రిసిప్షన్ కేంద్రాలకు అన్ని ఈవీఎంలు వచ్చాక అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ వీటిని గోదాంలకు తరలిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్‌లో వీటిని భద్రపరచనున్నారు. వచ్చే నెల 3న ఇదే గోదాంలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.