నీలగిరి, జూన్ 19 : నల్లగొండ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే సి.నారాయణరెడ్డి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వార్డు బాయ్స్‌ను సస్పెండ్ చేయడంతోపాటు విధులకు గైరాజరైతే కఠిన చర్యలు తప్పవని డాక్టర్లను సైతం హెచ్చరించారు. జిల్లా కేంద్ర దవాఖానను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, పాలియేటివ్ కేర్, మేల్, ఫిమేల్ వార్డులు, సర్జికల్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎంసీహెచ్ వార్డులన్నింటినీ కలియతిరిగారు. ఆయా వార్డుల్లో రోగుల బంధువులతో ముఖాముఖి మాట్లాడారు.
ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని, 5 రూపాయల భోజనం ఇస్తున్నారా?, తాగునీరు ఎలా ఉంది, టాయిలెట్లు బాగున్నాయా తదితర వివరాలు, సమస్యలను అడిగి తెలసుకున్నారు. మేల్ సర్జికల్ వార్డులో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని రోగుల సహాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన తీవ్రంగా స్పందించారు. పేదలు మాత్రమే ప్రభుత్వాస్పత్రికి వస్తారని, ఆపదతో వస్తే డబ్బులు అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు అడిగిన ఇద్దరు వార్డ్ బాయ్‌లను సస్పెండ్ చేశారు. డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ఆయా వార్డులు, షిఫ్ట్‌లవారీగా పనిచేసే వారి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడుగడమే కాకుండా హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది కేటాయించిన షిఫ్ట్‌ల్లో ఉండాలని, లేకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడానికి సైతం వెనుకాడబోమని తెలిపారు. పని చేస్తేనే ఆస్పత్రిలో ఉండాలని, లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య సిబ్బంది, కాంట్రాక్టర్‌కు తెలిపారు. ఆయన వెంట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్, ఆర్ఎంఓ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.