నల్లగొండ, జనవరి 2 : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బహిరంగ మారెట్లో విక్రయించినా, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో పౌర సరఫరాల శాఖ డీటీలు, గోదామ్ ఇన్చార్జీలు, రేషన్ డీలర్ల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపు ముందు ప్రభుత్వ చౌక ధరల దుకాణం బోర్డు కలిగి ఉండాలన్నారు.
డీలర్లు సమయ పాలన పాటించాలని, రేషన్ షాపును తెరిచి ఉంచి, బియ్యం సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. డీలర్లందరూ ఆథరైజేషన్ రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలు ప్రతి నెలా 10వ తేదీ లోగా రేషన్ బియ్యం షాపులకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 13,93,630 యూనిట్లు ఈ-కేవైసీ చేయవలసి ఉండగా.. ఇప్పటి వరకు 9,68,698 (69.51%) పూర్తయిందని తెలిపారు. ఇంకా 4,24,932 కార్డుదారులు ఈ-కేవైసీ చేయాల్సి ఉన్నదని తెలిపారు. డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు పాల్గొన్నారు.