నీలగిరి, మే 31 : జిల్లాలో ఈ వానకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని అన్నారు. జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీలో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని, ఒకవేళ విడి విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు వస్తే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, ఎకడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే 7288800023 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడిన టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే తమ టీమ్స్ ద్వారా మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు.
గతేడాది కంటే ఈ ఏడాది ఎకువ విత్తన నిల్వలు ఉన్నాయని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో 941 అవుట్లెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. విత్తనాలు అవసరమైన రైతులు ఈ అవుట్లెట్ల ద్వారా మాత్రమే కొనాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలు 30 కిలోలు రూ.1116, పిల్లి పెసర 40 కిలోలు రూ.1,084, పత్తి విత్తనాలు 475 గ్రాములు రూ.864 అమ్ముతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలపై 65శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, సమాచార శాఖ సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రైతులకు విత్తనాలు అందుబాటులో లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ దాసరి హరిచందన శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్, దేవరకొండ రోడ్లో పలు విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన విత్తనాలు ఉన్నాయా లేవా? ఎలాంటి విత్తనాలు విక్రయాలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పత్తి విత్తనాలు ఏయే కంపెనీలు వాడుతున్నారని, లూజ్ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు అడిగిన విత్తనాలను అందించాలని డీలర్లకు ఆమె సూచించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.