భువనగిరి కలెక్టరేట్, జూన్ 5 : బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. నేటి నుంచి 19వరకు జరిగే కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి కమిటీలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సంఖ్య పెరిగేలా పని చేయాలని సూచించారు. రైట్ టు ఎడ్యుకేషన్(ఆర్టీఈ)లో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా బడికి వెళ్లాలని, అందుకోసం గ్రామాల్లో హ్యాబిటేషన్లలో పిల్లలను గుర్తించి దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు.
నేడు గ్రామస్థాయి డ్రైవ్ చేపట్టి స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ర్యాలీలు, 7న ప్రతి ఇంటికి వెళ్లి పాఠశాలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని, సూళ్లకు వెళ్లే విద్యార్థుల వివరాలను విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్లో నమోదు చేయాలని, 8 నుంచి 10 వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతులపై అవగాహన కల్పించడం, 11న గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 12న విద్యార్థులకు స్వాగత దినోత్సం ఏర్పాటు చేసి పాఠశాలలను అందంగా అలంకరించాలని, అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో చేపట్టిన వసతులను వివరించాలని, పేరెంట్ టీచర్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేయాలని సూచించారు.
13న తరగతి వారీగా విద్యార్థులు తయారు చేసిన పోస్టర్లు, చాట్స్ ప్రదర్శించాలన్నారు. 14న సామూహిక అక్షరాభ్యాసం ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఉన్నత విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని, 15న సహిత విద్య, బాలికల విద్యా దినోత్సవం జరుపుకోవాలని, బడిబాటలో గుర్తించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత కేంద్రాలు, పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. 18న డిజిటల్ తరగతులపై అవగాహన కల్పించాలని, విద్యార్థులతో మొకలు నాటించే కార్యక్రమాలు చేపట్టాలని, మొకలు పెంచే బాధ్యతను వారికే అప్పగించాలని తెలిపారు. 19న క్రీడా దినోత్సవం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో పాఠశాలల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.