భువనగిరికలెక్టరేట్, నవంబర్ 7: వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులకు తరలించడానికి లోడ్ చేయడానికి లారీలను అధికంగా పంపిస్తామని తెలిపారు. కేంద్రంలో ఈ రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం వచ్చిన ధాన్యం కుప్పలను ఎంత ఆలస్యమైనా కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
తిప్పర్తి, నవంబర్ 7: నాణ్యతా ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నిర్వాహకులను ఆదేశించారు. తిప్పర్తి మండలం కేశరాజుపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. 17 శాతం తేమతో తాలు, తరుగు లేకుండా నాణ్యతా ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఇదే మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గల వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో ఖరీఫ్ ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. జాప్యం లేకుండా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన హమాలీలు, స్థలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎస్ఎల్బీసీ వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ తదితరులు ఉన్నారు.