మోటకొండూర్, మే 18 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ను జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ హనుమంత్ కె.జెండగే అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైసూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన తాగునీరు ఏర్పాట్లు, టాయ్లెట్లు, విద్యుద్దీకరణ, తరగతుల మరమ్మతు పనులను శనివారం ఆయన పరిశీలించారు. మల్లాపురంలో విద్యార్థులకు డ్రెస్సులు కుడుతున్న స్వయం సహాయక మహిళా సంఘం ద్వారా నడుపబడుతున్న మహాలక్ష్మి కుట్టు కేంద్రాన్ని సందర్శించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో 673 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూర్బా, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 51,848 మంది విద్యార్థులకు యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం అన్ని మండల కేంద్రాలకు క్లాత్ పంపించామన్నారు. 541 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా డ్రెస్సులు కుట్టించి జూన్ 12న విద్యార్థులకు అందించేటట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ ఎంఏ కృష్ణన్, డీఈఓ కె.నారాయణరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్యక్షులు వైష్ణవి, సంధ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, మహిళా సమాఖ్య సభ్యులు ఉన్నారు.