నల్లగొండ, మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఎన్నికల వ్యయ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో ఆమె బ్యాంకర్లతో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా నగదుతోపాటు, ఆభరణాలు, వస్తువులను పంపిణీ చేసే అవకాశం ఉందని, వీటన్నింటిపై గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. ప్రత్యేకించి బ్యాంకుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ శాఖలు ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలతోపాటు, గూగుల్ పే, ఫోన్ పే నుంచి ఎకువ మొత్తాన్ని పంపించినప్పుడు, ఏదైనా షాపులకు ఎకువ మొత్తంలో కూపన్లు ఇచ్చినప్పుడు వాటిపై దృష్టి సారించాలని అన్నారు.
ఎకడైనా నగదు, మద్యం వంటివి పంపిణీ చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలకు ఫోన్ కాల్ వస్తే తక్షణమే స్పందించాలని కోరారు. అంతకుముందు నగదు, ఆభరణాలు సీజ్ చేయడం, విడుదల చేసే అంశాలపై జడ్పీ సీఈఓ, జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, అదనపు ఎస్పీ రాములు నాయక్ పాల్గొన్నారు.