సూర్యాపేట నీటి పారుదల శాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కొంతమంది అధికారులు, ఉద్యోగులు అడ్డూఅదుపు లేకుండా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్వలు మూసి కొన్ని ప్రొంతాలకే నీటిని పంపి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు, చాలా చోట్ల చెరువుల్లో మట్టిని అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నట్లు ఆ శాఖకు చెందిన కింది స్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుంటారని, అద్దె వాహనాలు లేకున్నా సొంత వాహనాలకే బిల్లులు తీసుకుంటున్నారని తెలుస్తున్నది. అధికారులు, ఉద్యోగుల అవినీతిపై ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి రాష్ట్రంలో చుక్కనీటికి ఎరుగని లక్షలాది ఎకరాల బీడు భూములకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగు జలాలు ఇస్తే రైతులు సిరుల పంటలు పండించే స్థాయికి వచ్చారు. కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో నీళ్లు రాక మళ్లీ పంటలు ఎండడం, బీళ్లుగా మారడంతో రైతులు బోరుమంటున్నారు. ప్రభుత్వ నిర్వాకం అలా ఉంటే ఇరిగేషన్ అధికారుల అవినీతికి అంతే లేకుండా పోయింది. దీంతో రైతులకు మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. యాసంగిలో కాల్వకు వస్తున్న నీటిని కొన్ని చోట్ల షట్టర్లు క్లోజ్ చేసి వేరే ప్రాంతాలకు తరలించడానికి ఇరిగేషన్ ఉద్యోగులు, సిబ్బంది డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ నీళ్లు అందక ఎండిన పంట పొలాల రైతులు ఆందోళనలకు దిగిన విషయం విదితమే. ఇక ఇరిగేషన్ అధికారులు, ఉద్యోగుల అవినీతిని ఆ శాఖకు చెందిన కింది స్థాయి ఉద్యోగులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ శాఖలో రచ్చరచ్చగా మారింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంతోపాటు డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల అదే శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌కు 13 అంశాలతో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. జిల్లాలోని డీఈఈ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు అవినీతికి పాల్పడుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలు..