నీలగిరి, జూన్ 28 : జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో అంతా నిరుత్సాహమే కనబడింది. నల్లగొండకు రెండోసారి వచ్చిన సీఎం సభలో జనం లేక ప్రాంగణమంతా వెలవెలబోయింది. పదివేల మంది వస్తున్నట్లు అంచనా వేసి కుర్చీలు ఏర్పాటు చేసినా, అవన్నీ సీఎం ప్రసంగిస్తుండగా ఖాళీగా కనిపించాయి. సీఎం మాట్లాడకముందే జనం వెళ్లిపోయారు. దీంతో సీఎం ప్రసంగానికి ముందే సభా ప్రాంగణం సగానికి పైగా ఖాళీ అయింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలు ఇంటికి వెళ్లేందుకు సిద్దపడ్డారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే జనం లేచిపోవడం ప్రారంభించారు. సభలో మూడు ప్రాంతాల్లో షామియాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయనను చూసేందుకు వీలు లేకపోవడంతో స్క్రీన్‌పై ఇంట్లో చూడలేమా అంటూ వెళ్లిపోయారు. కోమటిరెడ్డి ప్రసంగం తరువాత జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, స్థానిక ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడే సరికి సభా ప్రాంగణంలోని జనం దాదాపు 70 శాతానికి పైగా వెళ్లిపోయారు. దీంతో అధికారులు పోలీసుల చేత వారిని అపే ప్రయత్నం చేశారు. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, జనం గ్యాలరీలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన దారులను పోలీసులు మూసి వేశారు. దీంతో అక్కడే పెద్దసంఖ్యలో జనం నిలిచిపోయారు. వారు బయటకు వేళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.
సాధారణంగా సీఎం సభ అంటే జై కొట్టే కార్యకర్తలు.. కికిరిసిపోయే ప్రాంగణం కనిపిస్తాయి. కానీ నల్గొండలో మాత్రం సీన్ కాస్త రివర్స్ అయింది. కుర్చీలు ఎకువ..? జనం తకువ అనేలా సభ సాగింది. ఇరవై వేల మంది వస్తారని ఆశించిన నేతలకు… రెండు వేల మందే కనిపించడంతో నిరాశలో మునిగిపోయారు. ఇక సభలో పోలీసుల సంఖ్య చూసి కొందరు… ఇది ప్రజా సభా… పోలీసు పరేడా…? అని జోకులు వేశారు. జనసమీకరణ బాధ్యత తీసుకున్న నేతలు మాత్రం.. జనం వస్తున్నారు… వస్తున్నారు.. అంటూ చివరి నిమిషం వరకు రూట్ మ్యాప్‌లు చూసుకుంటూనే ఉన్నారు. అయితే ఆ రూట్లలో జనం కంటే పోలీసు వాహనాలే ఎకువగా కనిపించాయి. సభా ప్రాంగణంలోకి వచ్చిన వారిలో కొందరు సీఎం ప్రసంగం మొదలయ్యే లోపే సెల్ఫీలు పూర్తి చేసుకోగా… మరికొందరు ప్రసంగం మధ్యలోనే ట్రాఫిక్ పెరగకముందే పోదామనే యోచనతో నిష్రమించారు. సీఎం మాట్లాడుతుంటే కుర్చీలు ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా విన్నాయంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. జనం లేని సభలో కుర్చీలే నిజమైన కార్యకర్తలు అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. ఇక సభకు వచ్చిన జనాల కంటే బందో బస్తుకు వచ్చిన పోలీసులే ఎకువగా ఉన్నారని స్థానికులు చర్చించుకోవడం విశేషం. దీంతో కొందరు… సభ విజయవంతమైందో లేదో తెలియదు కానీ, పోలీసుల అటెండెన్స్ మాత్రం వంద శాతం నమోదైంది అంటూ చమతరించారు. మొత్తానికి… భారీ అంచనాలతో ప్రారంభమైన సభ.. రాజకీయంగా ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. జనసమీకరణ లోపమా…? స్థానిక నాయకుల సమన్వయ లోపమా…? లేక ప్రజల మూడ్ మారుతోందా…? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు జన సమీకరణలో విఫలం కావడంతో అధికార కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడింది. సాక్షాత్తు సీఎం ముందే కాంగ్రెస్ వర్గాలు సీఎం కార్యాలయ సిబ్బందితో స్టేజీ పైనే బాహాబాహీకి దిగాయి. సీఎం ప్రత్యేక సిబ్బందిపై స్థానిక కార్పొరేటర్లు, నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా సీఎం సెక్యురిటీ స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుల మధ్య తొపులాటలు జరిపి పిడిగుద్దుల వరకు వెళ్లింది. దీంతో సీఎం సిబ్బందికి ఏం చేయాలో తోచకపోవడంతో అక్కడి నుంచి సీఎం వెంటనే వెళ్లిపోయారు. ముందుగా సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లతో ఫొటోలు దిగాలని నిర్ణయించారు. అమేరకు అధికార యంత్రాంగం అనుమతి కూడా తీసుకున్నారు. అంతా బాగానే ఉన్నా బహిరంగ సభలో సీఎం ప్రసంగం ముగిసిన తరువాత స్టేజీ కుడివైపున పార్టీ నాయకులు, కార్పొరేటర్లుతో ఫొటోలు దిగాలని నిర్ణయించారు. కానీ సీఎం వ్యక్తిగత సిబ్బంది అటువైపు కాకుండా స్టేజీకి ఎడమ వైపు దింపారు. దీంతో ఫొటోలు దిగేందుకు అటువైపుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు వెళ్లారు. దీంతో సీఎం సెక్యూరిటీ ఆయనను అడ్డుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులను సీఎం సెక్యురిటీ తోసివేయడంతో కిందపడ్డారు. దీంతో సీఎం సిబ్బందిపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు ఒక వర్గంగా, సీఎం సెక్యూరిటీ సిబ్బంది మరోవర్గంగా ఏర్పడి తోపులాట జరిగింది. దీంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగి అక్కడ ఉద్రిక్త వాతవరవణం నెలకొంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి అకడి నుంచి వెళ్లిపోవడంతో నాయకులను పోలీసులు చెదరగొట్టారు.