నల్లగొండ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు. శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులు రమాదేవి, శ్రీనివాసరావుతో కలిసి సీఎంకు పుష్పగుచ్చం అందజేసి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకటరమణ కుటుంబ నేపథ్యం గురించి ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించిన వెంకటరమణ ప్రస్తుతం జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోజూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పట్టుదలతో చదివి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించడం అభినందనీయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇటికాల సాత్విక్ రెడ్డి, అఖిల్ రెడ్డి, వాసుదేవ్, సీనియర్ జర్నలిస్ట్ ఇటికాల రమణారెడ్డి పాల్గొన్నారు.