Tahawwur Rana : కెనడా ప్రభుత్వం (Canada Govt) ముంబై ఉగ్రదాడుల (Mumbai terror attacks) ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
తహవ్వుర్ రాణా ప్రస్తుతం భారత్‌లో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. కాగా 1997లో రాణా కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ‘ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC)’ అతడికి కెనడా పౌరసత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఐఆర్సీసీ చర్యలు ప్రారంభించింది. దీనికి కారణం అతడిపై ఉన్న ఉగ్ర ఆరోపణలు కాదని, తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందడంపై ఈ చర్యలు చేపట్టామని వివరించింది.
పౌరసత్వం కోసం రాణా దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను టొరంటో నివాసినని పేర్కొన్నాడు. కానీ, ఆ సమయంలో అతడు షికాగోలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై తహవ్వుర్ 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని యూఎస్ అధికారులు గతేడాది భారత్‌కు అప్పగించారు.
కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 26న భారత్‌కు రానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, దౌత్య సంబంధాల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోందని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొన్నది. భారత పర్యటన అనంతరం కార్నీ ఆస్ట్రేలియా, జపాన్‌కు వెళ్లనున్నారు.
కెనడా ప్రధాని భారత పర్యటనపై ఆ దేశంలోని ఫోరం ఆఫ్ ఫెడరేషన్స్ సీఈవో రూపక్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ.. భారత్, కెనడా మధ్య రాజకీయ, వ్యవస్థీకృత సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాలు కలిసి పని చేయడంవల్ల భవిష్యత్తులో అనేక పరస్పర ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు.