The Kerala Story 2 | బాలీవుడ్ నుంచి రాబోతున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’పై కేరళ హైకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా కేరళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని సినిమా విడుదలను ఆపాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖాలు కాగా.. ఈ పిటిషన్‌ని నేడు విచారించిన ధర్మాసనం కేరళ రాష్ట్రంలో ప్రజలందరూ పూర్తి సామరస్యంతో జీవిస్తున్నారని, అయితే ఈ సినిమా కేరళను తప్పుగా చిత్రీకరించేలా ఉందని అభిప్రాయపడింది.
అంతేగాకుండా.. ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను పరిశీలించిన న్యాయమూర్తి, కేరళ పేరును టైటిల్లో ఉపయోగించడం వల్ల రాష్ట్రంపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఇది మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు, చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయాలని కోర్టుతో పాటు చిత్ర నిర్మాతలు ఆదేశించింది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు చెబుతున్నందున, కేరళ ప్రజల భయాందోళనలను విస్మరించలేమని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. సినిమా టైటిల్లో కేరళ పేరు ఉన్నప్పటికీ, చిత్రంలో ఇతర రాష్ట్రాల కథలు కూడా ఉన్నాయని, ఇది ఒక ప్రాంతాన్ని కించపరిచేలా ఉందని పిటిషనర్ వాదించారు. గతంలో ‘ఘూస్ ఖోర్ పండిట్’ వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్ గుర్తు చేస్తూ, టైటిల్స్ ఒక వర్గాన్ని లేదా ప్రాంతాన్ని అవమానించేలా ఉండకూడదని కోరారు. ఒకవేళ అలా ఉంటే ఆ సినిమా టైటిల్‌తో పాటు చిత్ర విడుదలను ఆపేయాల్సిందిగా పిటిషనర్ కోరారు.
అయితే చిత్ర నిర్మాతలు తమకు సెన్సార్ సర్టిఫికేట్ ఉందని వాదించినప్పటికీ, చట్టపరమైన నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన దృశ్యాలు లేదా మాటలు ఉండకూడదని కోర్టు పేర్కొంది. టీజర్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా విడుదల చేశారని పిటిషనర్ ఫిర్యాదు చేయగా, సినిమా ప్రదర్శనను వీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసును మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.