కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో డీఎంకే నేతకు చెందిన 20 ఏళ్ల కుమారుడు కారుతో హల్చల్ చేశాడు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌తో పాటు అతని కుటుంబంపై కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. కారు నడిపిన వ్యక్తిని ఆదిత్యగా, బాధితుడిని అసిస్టెంట్ లేబర్ ఇన్స్పెక్టర్ శివమూర్తిగా గుర్తించారు. శివమూర్తి ఇంటి ముందు నుంచి కారులో వెళ్తున్న సమయంలో ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఇంటి ముందు ఓ టూవీలర్ పార్క్ చేసి ఉందని, ఆ బైక్ కాస్త రోడ్డుకు అడ్డంగా ఉన్నట్లు తెలిసిందని, ఆ సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న ఆదిత్య.. పదేపదే హారన్ కొట్టాడు. బైక్‌ను తొలగించాలని అరిచాడు.
శివమూర్తి, అతని కుటుంబ ఇంట్లో నుంచి బయటకు వచ్చి టూవీలర్‌ను తీసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కారు డ్రైవర్ ఆదిత్య, లేబర్ ఇన్స్పెక్టర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపంలో శివమూర్తి, అతని కుమారుడు, కోడలు, మనవరాలిపై కారుతో దూసుకెళ్లాడు ఆదిత్య. తీవ్రంగా గాయపడ్డ శివమూర్తి ఆ తర్వాత చనిపోయాడు. కారుతో ఢీకొట్టిన ఘటనలో కుటుంబసభ్యులు కూడా గాయపడ్డారు. డ్రైవర్ తాగిన మత్తులో ఉన్నట్లు ఆ ఆఫీసర్ కుమారుడు పేర్కొన్నాడు. చాలా దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పాడు. పరిస్థితి శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆదిత్య తన కారుతో ఢీకొట్టినట్లు అతను చెప్పాడు.
ఆదిత్యతో పాటు కారులో ఉన్న అతని స్నేహితులు రితిక్ కుమార్, హరీశ్‌ను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తీవ్ర విమర్శలు చేశారు.