యాదగిరిగుట్ట, మే22: ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి గాడి తప్పింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పది శాతం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై శంకుస్థాపనలు పూర్తి చేసుకున్న పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. టెంపుల్ సిటీపైన వేదపాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజతోపాటు కొండపై రూ. 100 కోట్ల దేవస్థానం నిధులతో బాలాలయ ప్రాంతంలో కల్యాణ మండపం, వాయువ్య దిశలోని లిప్టు ప్రాంతం నుంచి కొండపైకి వెళ్లేందుకు మెట్ల నిర్మాణం, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతంలో దీక్షాపరుల మండపం, భక్తుల వసతి గృహాలకు కంచికామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం హోదాలో నాలుగోసారి రేవంత్‌రెడ్డి గుట్టకు రానున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. టెంపుల్ సిటీపై సుమారు 600 మంది కూర్చునేలా ప్రత్యేక షెడ్డు నిర్మించారు. అక్కడే వేదపాఠశాల శంకుస్థాపనతో పాటు కొండపై అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు ఆలయ అదికారులు తెలిపారు. ఈ సారైన దేవస్థానం అభివృద్ధి పనులను నిధులు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా బడ్జెట్లో గుట్ట అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 200 కోట్లు కేటాయించేవారు. కేసీఆర్ ప్రతి ఏటా పనుల పురోగతిని సమీక్షించి, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేవారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడేళ్లు కావొస్తున్నా గుట్ట అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించలేదు. గతంలో ప్రతిపాదించిన 10 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన పనుల బకాయిలు రూ. 130 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కాళేశ్వరం 16 ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న నృసింహస్వామి జలాయశం నుంచి డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా గండి చెరువులోకి గోదావరి జలాలను నింపిన అప్పటి ప్రభుత్వం స్వామివారి తెప్పొత్సవం నిర్వహించాలని ప్రతిపాదించింది. భక్తులకు ఆధ్యాత్మికతోపాటు మానసిక ఉల్లాసం కలిగేలా గండి చెరువు పరిసర ప్రాం తాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం వైటీడీఏ నిధుల కింద రూ. 33.70 కోట్లు కేటాయించింది. కాగా కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా తెప్పొత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు పెండింగ్‌లో పెట్టారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు తరహాలో గండిచెరువు ప్రవేశ ద్వారం వద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
స్వామివారి దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి భద్రత కల్పించేందుకు ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన అధునాతన విద్యుద్దీపాలను గుట్ట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రాయగిరి నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం, టెంపుల్ సిటీ, రింగు రోడ్డుతో పాటు గుట్ట చుట్టూ సుమారు 5.7 కిలో మీటర్ల మేర 200 మీటర్ల దూరంలో ఒక్కో విద్యుద్దీపం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో సీసీ కెమెరాతో పాటు సౌండ్ సిస్టం సైతం ఉండటంతో స్వామివారి నిత్య కైంకర్యాలు సౌండ్ సిస్టం ద్వారా రాయగిరి వరకు భక్తులకు వినిపిస్తాయి. ఈ సౌండ్ సిస్టమ్ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పా టును పక్కన పెట్టింది.
గుట్టకు వచ్చే భక్తులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక నిఘా ఉండాలనే ప్రతిపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. లగేజీ, వాహనాల్లో బాంబులు, పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు అత్యాధునిక బామర్స్, లగేజీ, వాహనం స్కానర్లు, ఫ్లాట్ బారియర్స్, డీఎఫ్ఎండీలను అమర్చాలని నిర్ణయించారు. వాహనాలు వెళ్లే ఫ్లై ఓవర్, ఘాట్ రోడ్లు, బస్ బే వద్ద ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తే బాగుటుందని నాటి సర్కార్ భావించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఆచరణలో పెట్టడంలేదు. ప్రతి భక్తుడు క్యూఆర్ కోడ్‌తో దర్శనం చేసుకునేలా నడుచుకుంటూ వచ్చే భక్తులకు వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేకమైన రిసెప్షన్ ఏర్పాటు చేసి అక్కడే క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నది కేసీఆర్ నిర్ణయం. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను లెక్కించేందుకు ఇజ్రాయిల్ సాంకేతికతతో కూడిన ‘ప్లాప్ బారియర్స్’, భక్తుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఆటోమేటెడ్ యాక్సెస్ కంట్రోల్ పరికరం అందుబాటులోకి తెచ్చారు. ఆలయం పున:ప్రారంభం అనంతరం కొండపై క్యూ కాంప్లెక్స్, లడ్డూ ప్రసాద విక్రయశాలు, తూర్పు రాజగోపురంతో పాటు పశ్చిమ రాజగోపురం వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల ముఖాలను స్క్రీన్ చేసి కంట్రోల్ రూంలోకి అందిస్తుంది. దీంతో రోజుకు ఎంత మందికి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారో చెప్పేందుకు వీలుంటుంది. అయితే ప్రస్తుతం ఈ కెమెరాలను వినియోగించడం లేదు.
కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న నెట్ వర్క్ బ్రిడ్జి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. కేసీఆర్ సర్కార్ నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టినా, ప్రస్తుత సర్కార్ పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైకి వెళ్లి తిరిగి వచ్చేందుకు రూ.69 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టగా, ఎగ్జిట్ ఫ్లై ఓవర్‌ను గత ప్రభుత్వమే అందుబాటులోకి తెచ్చింది. కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా లండన్ నుంచి నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జికి సంబంధించిన విడి బాగాలు దిగుమతి చేశారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 10 శాతం పనులు పూర్తి చేస్తే బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.
స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు ఇరువైపులా దుకాణాలు, కొండపైన దుకాణాలు కోల్పోయిన వారికి కొండకింద కల్యాణ కట్ట, నిత్యాన్నదానం, బస్‌స్టాండ్, సెంట్రల్ పార్కింగ్ ప్రాంతాల్లో సుమారు 139 షాపులు నిర్మించగా 59 మందికి లబ్దిదారులకు ప్రొసిడింగ్లు అందజేయగా వినియోగంలోకి వచ్చాయి. మిగతా వాటిల్లో కనీస వసతులు కల్పించాల్సి ఉండగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొండ కింద పార్కింగ్ ప్రాంతంలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి గదులు నిర్మిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను వైటీడీఏ సిద్ధం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కొండకింద ఉన్న బస్టాండ్ పక్కనే కొండపైకి వెళ్లేందుకు దేవస్థాన బస్సు ప్రాంగణ నిర్మాణం దాదాపుగా చివరిదశకు వచ్చింది. మిగతా పనులు పూర్తి చేసి ప్రారంభించాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం లేదు. కొండపైకి వెళ్లే భక్తులకు గత సర్కార్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట డిపోకు ఈ బాధ్యతలు అప్పగించింది. నెలకు సుమారుగా కోటి నుంచి కోటిన్నర దేవస్థానం చెల్లిస్తోంది. రాబోయే రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలోనే బస్సులు కొనుగోలు చేసి ఉచిత ప్రయాణం కల్పించాలని బీఆర్ఎస్ సర్కార్ సంకల్పింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయించి తొలి విడతగా 40 నుంచి 50 బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా ప్రభుత్వం మారడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి ఆర్టీసీ బస్సుకు ఇచ్చే నెలవారీ కిరాయితోనే దేవస్థానం బస్సులు కొనుగోలు చేయవచ్చు. ఖర్చు సైతం తక్కువగానే వస్తోందని దేవస్థాన అధికారులు వెల్లడించారు.
స్వామివారి దివ్యక్షేత్రాన్ని రూ. 1300 కోట్లతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించగా ఆలయంతో పాటు పరిసరాల పనులు దాదాపుగా పూర్తి చేసుకుని 2022 మార్చి 28 నుంచి నూతనాలయంలో స్వయంభూ పంచనారసింహస్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 30 నుంచి 40 వేలు మంది భక్తులు ఆలయానికి వస్తుండగా నిత్యం రాబడి రూ. 30 లక్షలు, వారాంతపు సెలవుల్లో 50 నుంచి 70 వేల పైచిలుకు వస్తోంది. ఇదికాక నిత్యాదాయం రూ. 70 నుంచి కోటి వరకు వస్తోంది. భక్తుల సౌకర్యార్థం గతంలోనే రాయగిరి మెట్ల బావి వద్ద వేద పాఠశాలను మంజూరు చేయడంతో పాటు 2023 జూన్ 21న అప్పటి దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కొండపైన పాత బాలాలయ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించిన కేసీఆర్ ఆ ప్రాంతంలో కల్యాణ మండపం, సంగీత భవనాలు, ఎలివేటర్ పార్కు నిర్మించాలని ఆదేశించారు. వాయువ్యదిశలో కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన మెట్లతోపాటు ఎస్కలేటర్ నిర్మిస్తే బాగుటుందని ప్రతిపాదించి ఆమోదం తెలిపారు. వైకుంఠ ద్వారం వద్ద నుంచి కాలినడక వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన శ్రీవారిమెట్ల మార్గంలో ప్రత్యేకమైన టెన్నెల్స్ ఫ్యాబ్రిక్ షెడ్డు నిర్మాణం, సత్యనారాయణ వత్ర మండపం నుంచి కొండపైకి లిప్టు పనులు చేపట్టాలని ఆదేశించడంతో పాటు నిధులు కూడా మంజూరు చేసి, పనులకు శంకుస్థాపన చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనులకే తిరిగి మరోసారి ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపన చేయడమేమిటని భక్తులు, పట్టణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.