సూర్యాపేట టౌన్, ఆగస్టు 18 : వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సూర్యాపేటకు తొలి దశలోనే మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మూడేండ్ల కింద పాలిటెక్నిక్ కళాశాల భవనంలో మెడికల్ తరగతులు ప్రారంభించగా.. సూర్యాపేటకు తలమానికంగా ఉండేలా శాశ్వత భవనానికి శ్రీకారం చుట్టారు. 20ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.156కోట్లతో సకల సౌకర్యాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెడికల్ కళాశాలను నిర్మించారు. సూర్యాపేట ముఖ ద్వారంలో నిర్మితమైన ఈ కాలేజీని ఈ నెల 20న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
8 విభాగాలుగా భవన నిర్మాణం
నిరుపేదల దేవాలయంగా విరాజిల్లుతున్న సూర్యాపేట మెడికల్ కళాశాల శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. బాల బాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ పేరుతో 8 విభాగాలుగా పని విభజన చేసి నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. 20 ఎకరాల్లో కళాశాల భవనం, బాల, బాలికలకు వేర్వేరుగా ప్రిన్సిపాల్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాస్టళ్లు సిద్ధం చేశారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఆరు ఎకరాల్లో పార్కులను తీర్చిదిద్దారు. ఐదు బ్లాకుల్లో తరగతి గదులు, లెక్చరర్ గ్యాలరీ, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఒక బ్లాక్‌లో అకాడమిక్ అండ్ ఎగ్జామినరీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగశాల బ్లాక్, డిపార్ట్మెంట్ బ్లాక్‌తోపాటు వైద్య విద్యార్థులకు రెస్టారెంట్ నిర్మాణం చేపట్టారు.
900 మందికి వసతి కల్పించేలా హాస్టల్స్
మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు మొత్తం 700 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. అందులో 450మంది బాలురు, 250మంది బాలికలు ఉంటారు. ఇందులో 60శాతం మందికి మాత్రమే హాస్టల్ వసతి కల్పించాలని వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. విద్యార్థులు కాకుండా ప్రతి హాస్టల్‌కు కుకింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ, ధోబీ ఇతర పనులకు సంబంధించి మరో 60మంది సిబ్బంది ఉంటారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా 900 మందికి వసతి కల్పించేలా విశాలమైన హాస్టల్ భవనాలు నిర్మించారు. బాలురకు జీ+5, బాలికలకు జీ+5తో నిర్మాణాలు చేశారు. ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు ఉండేందుకు వీలుగా జీ+5 సామర్థ్యంతో టీచింగ్, నాన్ టీచింగ్ క్వార్టర్స్ పేర జీ+5 భవనాన్ని కూడా నిర్మించారు.
పచ్చదనం కోసం గ్రీనరీ ఏర్పాటు
కళాశాల భవనంలో ఇంటర్నల్ రోడ్డు కాంపౌండ్ వాల్ నిర్మాణంతోపాటు అన్ని విధాలుగా మెడికల్ కళాశాల నిర్మాణం జరిగింది. కళాశాల ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 6ఎకరాలు కేటాయించారు. అందులో రకరకాల మొక్కలతో గ్రీనరీ పార్క్‌ను ఏర్పాటు చేశారు.