యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించుకున్న ఏడాది ఇది. మార్చి 28 నాటి మహాకుంభ సంప్రోక్షణతో మొదలైన స్వయంభు పంచనారసింహుడి దర్శన ఆపన్నులకు అభయహస్తాన్ని అందిస్తున్నది. కోట్లాది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. యాదాద్రి అనుబంధ దేవాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరఆలయం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్, కల్యాణకట్ట, పుష్కరిణి, దీక్షాపరుల మండపాల వంటివన్నీ ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చాయి. యాదాద్రీశుడి పాదాల చెంతకు కాళేశ్వర గంగ చేరడం మరొక అద్భుత ఘట్టం. ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం ఇతర వసతుల కల్పనపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. యాద్రాదీశుడి అధికారులతో సమీక్షలు జరిపి అదనపు నిధులు మంజూరు చేయడం తెలిసిందే. ఆధ్యాత్మిక ప్రపంచాన ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న యాదాద్రికి సంబంధించి ఏడాది విశేషాల సమాహారం ఈ ప్రత్యేక కథనం.
యాదాద్రి, డిసెంబర్ 27 : 2022 యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఆరేండ్లలోనే రూ.1,100 కోట్లతో నిర్మించిన యాదాద్రీశుడి దివ్య సన్నిధి పునఃప్రారంభమైంది ఈ ఏడాదిలోనే. అనుబంధ దేవాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయం, ప్రెసిడెన్సియల్ సూట్‌తో పాటు కొండ కింద భక్తులకు సకల ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు, మరెన్నో అభివృద్ధి పనులు సాగాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రారంభోత్సవాలు, మరెన్నో సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అంకితమిచ్చారు. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన ఎన్నో పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చరిత్రలో నిలిచిపోయే కలెక్టర్ భవనం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంతోపాటు కేసీఆర్ కలల ప్రాజెక్టయిన కాళేశ్వరం జలాలు సైతం ఈ ఏడాదిలోనే జల్లాకు వచ్చాయి. 2020, 2021.. కొంత వరకు చీకటి సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ మహమ్మారి మన దేశం, రాష్ట్రం, మన జిల్లాలను సైతం కుదిపేసింది. ఈ రెండేండ్లు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పడినపాట్లు అంతా ఇంతాకాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవతో వంద శాతం కొవిడ్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్‌తో కొవిడ్‌ను ఎదుర్కొన్నాం. 2022 సంవత్సరంలో కొవిడ్ ప్రభావం పెద్దగా పడలేదు. దాంతో జిల్లాలో ఎన్నో ప్రారంభోత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి. యాదాద్రి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వరస్వామి వారి ఆలయం పునఃప్రారంభంతో పాటు నూతనంగా కొండ కింద నిర్మించిన కల్యాణకట్ట, పుష్కరిణి, దీక్షాపరుల మండపాలు అందుబాటులోకి వచ్చాయి.
యాదాద్రి పునర్నిర్మాణం అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తి కృష్ణ శిలలతో నిర్మితమైన యాదాద్రి దేవస్థానం చూస్తూ భక్తిభావం పొందుతున్నారు. గత దేవస్థాన చరిత్రలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఒక్కరోజు లక్ష మంది భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. కార్తిక మాసం సందర్భంగా నవంబర్ 13న స్వామివారిని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వచ్చారు. దాంతో స్వామివారి ఖజానాకు కోటీ 9 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. అదే నెల 19న భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గినా ఆదాయం మాత్రం రూ.1,16,13,977 వచ్చింది. ఈ రెండు రికార్డులు ఈ ఏడాదిలోనే జరిగాయి. దేవాలయ చరిత్రలో రికార్డు స్థాయి ఆదాయం సైతం ఈ ఏడాదిలోనే నమోదైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభం అనంతరం విదేశీ పర్యాటకుల సందడి పెరిగింది. నూతనాలయం పునఃప్రారంభం తర్వాత వారానికి రెండు మూడు ధపాలుగా విదేశీయులు యాదగిరిగుట్ట కొండపై దర్శనమిస్తున్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా 2022 సంవత్సరంలో అమెరికాతో, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మన్, న్యూజిలాండ్, యూరో, కెనడా, ఖతార్, సింగపూర్, స్కాట్లాండ్, కెనడా, సింగపూర్‌కు చెందిన విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకోవడం గొప్ప విషయం. ఇందులో ప్రధానంగా అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, అరబ్ దేశాలకు చెందిన పర్యాటకులు అధికంగా వస్తున్నారు. ఆరేండ్లలో జరిగిన యాదగిరిగుట్ట స్వయంభూ ఆలయ పునర్నిర్మాణం దేశ విదేశాల్లో విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా హుండీకి విదేశీ కరెన్సీ భారీగా వస్తున్నది.
యాదాద్రి కొండ కింద 2.57 ఎకరాల్లో రూ.17.38 కోట్లతో నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపం ఈ ఏడాది ఆక్టోబర్ 25న భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి 12వేల మంది భక్తులు వ్రత మాచరించేలా నిర్మించిన వ్రత మండపంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వ్రతాలు సాగుతున్నాయి. కొండ కిందకు వచ్చే ఎగ్జిట్ ఫ్లై ఓవర్ దిగువ భాగంలో నిర్మించగా, వ్రతాల కోసం రెండు హాళ్లను, ఒక్కో హాల్లో 250 వ్రత పీటలను ఏర్పాటు చేశారు. నవంబర్ 13న రికార్డు స్థాయిలో 1,681 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. వ్రత పూజల ద్వారా నిత్యరాబడి రికార్డు స్థాయిలో రూ.13,44,800 వచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుఠిత దీక్ష.. స్తపతుల కఠోర శ్రమ, వైటీడీఏ, దేవస్థానం అధికారుల పర్యవేక్షణ.. అర్అండ్బీ పనితీరుతో ఆరేండ్లలో పూర్తయిన యాదాద్రి దేవస్థానం 9 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ క్రతువులతో స్వయంభువుగా వెలిసిన పంచనారసింహుడి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. ఉదయం 11.55 గంటలకు మిథునలగ్న ముహూర్తాన దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రోక్షణ గావించి కృష్ణశిలల మహా దేవాలయాన్ని ప్రారంభించారు.
యాదాద్రిలో మరో ఘట్టం రామలింగేశ్వస్వామివారి ప్రధానాలయం పునఃప్రారంభం. యాదాద్రికి అనుబంధ ఆలయమైన రామలింగేశస్వామివారి ప్రధానాలయం గతంలో 500 గజాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎకరం స్థలంలో నవగ్రహ మండపం, ఆంజనేయస్వామి, మరకత మండపాలు, బయట రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలతో పనులు పూర్తయ్యాయి. శివాలయం లోపల రాతి ముఖ మండపం, ఆంజనేయస్వామి దేవాలయం, గణపతి దేవాలయం, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయం, యాగశాలను నిర్మించారు. ఈ దేవాలయాన్ని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఏడాది ఏప్రిల్ 25న పునఃప్రారంభించారు. శివాలయ ప్రతిష్ఠ ఉప దేవీదేవతల ప్రతిష్ఠ, పంచకుండాత్మక పాంచాహ్నిక దీక్షావిధానంతో 54 మంది ఆచార్య బ్రహ్మ వేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందంతో స్మార్తగమ సంప్రదాయరీతిలో 25వ తేదీన ఉదయం 10:25 గంటలకు మాధవానంద సరస్వతీస్వామి రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్టాంగహోమం, ఆఘోర మంత్ర హోమం, దిగ్దేవతాక్షేత్ర పాల బలిహణం వంటి తంతులతో రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం పునఃప్రారంభమైంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం పునఃప్రారంభం అనంతరం జరుగుతున్న పనులను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తూ తగు సూచనలు చేస్తూ వస్తున్నారు. 2022లో 5 దఫాలుగా యాదాద్రిని సందర్శించారు. ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్ పునర్నిర్మాణ పనులను పరిశీలించి ఆలయ పునః ప్రారంభానికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఫిబ్రవరి 12న ప్రెసిడెన్సియల్ సూట్‌ను ప్రారంభించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు. ఏప్రిల్ 25న కుటుంబ సమేతంగా పాల్గొని అనుబంధ రామలింగేశ్వస్వామి ప్రధానాలయాన్ని పునః ప్రారంభించారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి స్వామివారిని దర్శించుకుని విమానగోపురం స్వర్ణతాపడానికి రూ.కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు.
గోదావరి జలాలు 36 కిలోమీటర్లు ప్రవహించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని 15వ ప్యాకేజీ ప్రారంభమైన సిద్దిపేట జిల్లా కొడగండ్ల రెగ్యులేటర్ నుంచి సుమారు 150 క్యూసెక్కుల నీటిని గండి చెరువులను నింపేందుకు మంత్రి హరీశ్‌రావు విడుదల చేయగా ఈ ఏడాది మార్చి 21న యాదాద్రిలోని గండి చెరువులోకి చేరాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కాళేశ్వరం జలాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేపట్టారు. 500 మీటర్ల ఎత్తు నుంచి యాదాద్రి ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ఇదేరోజు కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమైన నృసింహసాగర్ (బస్వాపూర్) లోకి గోదావరి జలాలను తీసుకొచ్చారు. 0.5 టీఎంసీల గోదావరి జలాలతో నృసింహసాగర్ జలాశయం కళకళలాడుతున్నది.