సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సూర్యాపేటకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం హాజరై బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డికి మద్దతుగా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. నియోజక వర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నాలుగు మండలాలతో పాటు జిల్లా కేంద్రంలోని 48 వార్డుల నుంచి పెద్ద ప్రజలు తరలి రానుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు రాకపోకలకు, పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. నేటి సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు సీఎం ప్రచారాలు పూర్తి కానున్నాయి. విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తూ మరోమారు సీఎం కేసీఆర్ సూర్యాపేటకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనని ప్రజలంతా వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు.