నల్లగొండ ప్రతినిధి, నవంబర్4(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మలి విడుత ఎన్నికల ప్రచారం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి మొత్తం 54 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొననున్నారు. తర్వాత ఈ నెల 20న నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. చివరగా ఈ నెల 21న సూర్యాపేటలో కేసీఆర్ పర్యటన జరుగనున్నది. సూర్యాపేటలో గత ఆగస్టు 20న జరిగిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. దాంతో ఉమ్మడి జిల్లాలో చివరగా సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారాన్ని పూర్తి చేశారు.
పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. గత నెల 16న భువనగిరి, 26న మునుగోడు, 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో, 31న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊహించిన దాని కంటే భారీ సక్సెస్‌గా సభలు జరుగడం విశేషం. ఇక నామినేషన్ల అనంతరం జరుగనున్న మిగిలిన నాలుగు సభలకు కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధినేత సభలతో అన్నిచోట్లా పార్టీలో గెలుపుపై మరింత విశ్వాసంతోపాటు శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొన్నది.
భువనగిరి అర్బన్, నవంబర్ 4 : 2024 మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 17 వరకు గడువు ఉన్నట్లు డీఈఓ కే.నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 1 వరకు, రూ.200తో డిసెంబర్ 11 వరకు, రూ.500తో డిసెంబర్ 20 వరకు చెల్లించవచ్చని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్నవారు తాసీల్దార్ నుంచి ఆదాయ ధ్రువీకరణ ప్రతం తీసుకువస్తే పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.