మిర్యాలగూడ/మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 24 : దేశ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినట్లు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని నందిపాడు శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షత జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు సైతం మాకు కూడా ఇలాంటి పథకాలు కావాలని, కేసీఆర్ మాకు నాయకుడిగా రావాలని కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. కేంద్ర అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు మతతత్వ పార్టీని విశ్వసించరని, బీజేపీ తెలంగాణలో లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదని, కేవలం అధికారంలోకి రావాలి, దోచుకోవాలనేదే వాళ్ల కుట్ర అని ఆరోపించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు పనితీరు అద్భుతంగా ఉందన్నారు. రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో సీపీఎం పోటీ చేస్తుందనడంలో వాస్తవం లేదని, తిరిగి మిర్యాలగూడలో భాస్కర్‌రావే పోటీలో ఉండి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష : ఎమ్మెల్యే భాస్కర్‌రావు
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక్కడ అమలవుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుందని, వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మిర్యాలగూడ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందిందన్నారు. ప్లీనరీలో 13 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, కుందూరు వీరకోటిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ, జిల్లా కోఆప్షన్ మెంబర్ మోసిన్‌అలీ, జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిన రామయ్య, మట్టపల్లి సైదులయాదవ్, నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, మదార్బాబా, యూసుఫ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, డకర్తలు పాల్గొన్నారు.