‘నేను మాట తప్పను.. మాట ఇచ్చిన్నంటే వంద శాతం అమలు చేసి తీరుత. ఇచ్చిన మాట కోసం తలనైనా నరుక్కుంటా కానీ మాట తప్పను.’ ఇది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ మాట్లాడే మాట. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు, తర్వాత జరిగిన బహిరంగ సభల్లో నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసి మాట నిలబెట్టుకున్నారు. – హాలియా, జూలై 26
హాలియా, జూలై 26 : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఏడాదిలోనే సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ.892 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. పలుచోట్ల శరవేగంగా జరుగుతున్నాయి. రూ.692 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రారంభించారు. ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ.38 కోట్లు కేటాయించారు. 12 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.150 కోట్లు కేటాయించగా.. అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో ఉన్నది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైంది. 2021 నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలో 222 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. దీంతో అనేక సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కారం కానున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే భగత్ అన్నారు. అనేక సంవత్సరాలుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులను వెచ్చిస్తామని తెలిపారు.
కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు సానుకూలత
నేరేడుచర్ల, జూలై 26 : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం, పాలకవీడును కొత్త మండలాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పరిపాలన చేయడానికి పక్కా భవనాలు లేక ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృషితో పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ రెండు మండలాల్లో ఇప్పటి వరకు తాసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, వ్యవసాయ కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అరకొర వసతులతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమీకృత భవనాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
సాగర్ అభివృద్ధికి నిధుల మంజూరు హర్షణీయం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.120 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలులో భాగంగా రూ.600 కోట్లతో నెల్లికల్ లిఫ్టు, హాలియాలో డిగ్రీ కళాశాల, నందికొండలో పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవి నిదర్శనాలు. ఏడు మండలాల్లో 222 పనులకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు, అందుకు కృషి చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు.
– కోటిరెడ్డి, ఎమ్మెల్సీ