ఏ ఒక్కరూ పస్తులతో ఉండొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు. సూర్యాపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం అల్పాహారం విద్యార్థుల కడుపు నింపడమే కాదని, నిత్యం పనులకు వెళ్లే తల్లులకు కూడా ఆసరా అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు ఈ పథకం నిదర్శనమని తెలిపారు. విద్యార్థుల డ్రౌపౌట్స్ తగ్గడానికి, శారీరక, మానసిక ఎదుగుదలకు సీఎం బ్రేక్ ఫాస్ట్ గొప్ప వరమని, దీని ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2,48,408 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. మొదటిరోజు టిఫిన్ చేసిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘దేశంలో మనిషి ఆకలి విలువ తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఏ ఒక్కరూ పస్తులతో ఉండొద్దనేదే ఆయన సంకల్పం. అందులో భాగంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉదయం టిఫిన్. పేదలను దృష్టిలో పెట్టుకొని పెట్టిందే సీఎం అల్పాహారం. పాఠశాల విద్యార్థుల కోసం తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ విద్యార్థుల కడుపు నింపడమే కాదు.. పనులకు వెళ్లే లక్షలాది మంది తల్లులకు ఆసరా.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయం కోసం ఎదురు చూసే ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా సీఎం కేసీఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని, అందుకే నేడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నదని తెలిపారు. పేదల కడుపు నింపేందుకు, మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకమని అన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడా లేదని అన్నారు. ఈ కార్యక్రమం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రానున్నదని, స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతాయని తెలిపారు.
ఈ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలల్లోని 67,255 మంది విద్యార్థులకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,139 పాఠశాలల్లోని 2,48,408 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఈ కార్యక్రమం పేద పిల్లలకు వరమని అన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పార్టీలకతీతంగా రాజకీయాలు, ఎన్నికలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఒక పథకం అమలు చేసే మందు కుటుంబ పెద్దగా తండ్రి ఎలా ఆలోచిస్తారో అదే కోణంలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తారని, అందుకే అవి విజయవంతం అవుతున్నాయని, సామాజిక మార్పునకు కారణమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్ల సమ్మేళనంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఇది విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్ ప్రియాంక, డీఈఓ అశోక్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డి, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా పేద విద్యార్థుల కడుపు నింపేలా ఉదయం అల్పాహారం అందించే పథకం చేపట్టడం హర్షణీయం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. పిల్లలు, తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులుగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తుండగా మరో వైపు రాగి జావ, ఉడికించిన కోడి గుడ్డు ఇస్తున్నారు. తాజాగా ఉదయం రుచికరమైన అల్పాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామీణ, పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలు ఉదయం, మధ్యాహ్నం పౌష్టికాహారం కడుపు నిండా తిని చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు. అంతేగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. నల్లగొండలో పైలెట్ ప్రాజెక్టుగా మా పాఠశాలను ఎంపిక చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మా బడిలో రోజూ మధ్యాహ్నం భోజనంతోపాటు ఉదయం రాగిజావ, ఉడికించిన కోడి గుడ్డు ఇస్తున్నారు. శుక్రవారం మా బడికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ సార్ వచ్చి టిఫిన్ వడ్డించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సార్‌తో కలిసి టిఫిన్ చేశా. చాలా సంతోషంగా ఉన్నది. ప్రైవేట్ బడి కంటే మా బడిలోనే చదువు బాగా ఉంది. రోజూ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇప్పుడు ఉదయం బడికి లేటుగా వచ్చే ఇబ్బంది తప్పింది. టిఫిన్ పెడుతున్న సీఎం కేసీఆర్ సార్‌కు నమస్కారం.
అమ్మ ఉదయం ఇంట్లో అన్నం చేసేసరికి ఒక్కోసారి బడికి రావడం లేటు అవుతుంది. ఇక నుంచి బడిలోనే టిఫిన్ పెడుతారని మా సార్ చెప్పారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సార్లు వచ్చి మా బడిలో పిల్లలందరికీ టిఫిన్ అందించే కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం కలిగింది. మాకు బడిలో స్కూల్ డ్రెస్‌తోపాటు పుస్తకాలు ఉచితంగా అందించారు. రోజూ రాగి జావ, వారంలో మూడు రోజులు కోడి గుడ్లు ఇస్తున్నారు. ఇక బడిలోనే టిఫిన్ పెడుతుండటంతో ఆలస్యంగా వచ్చే ఇబ్బంది ఉండదు. బడిలో పెట్టే టిఫిన్, మధ్యాహ్న భోజనం చేసి మంచిగా చదువుకొని పెద్దయ్యాక కలెక్టర్ అవుతా.
నల్లగొండలోని పద్మానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మా ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. గతంలో ప్రైవేట్‌కు పంపేవాళ్లం. గత సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో ఇక్కడికి పంపిస్తున్నాం. ప్రైవేట్ బడి కంటే ఎంతో బాగా చదువు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పేరుతో బడి పిల్లలకు టిఫిన్ అందించే కార్యక్రమం చేపట్టడం సంతోషకరం. దీంతో విద్యార్థులంతా మంచిగా చదువుకొని ఉత్తమ పౌరులుగా తయారయ్యే అవకాశం ఉన్నది. పిల్లలకు ఉదయం టిఫిన్ పెడుతున్న సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
అమ్మ రోజూ కూలి పనులకు వెళ్తుంది. పొద్దున చాయి తాగి బడికి వస్తాను. పొద్దున్నే అన్నం తినబుద్ది కాదు. మధ్యాహ్నం అన్నం పెట్టిందాకా ఆగాలి. కడుపు నొప్పి లేస్తది అప్పుడప్పుడు. నొప్పి లేసినప్పడు మంచినీళ్లు తాగుతాను. చదువబుద్ది కాదు. రేపటి నుంచి ఉదయం టిఫిన్ పెడుతారని నిన్న మా సార్ చెప్పాడు. ఇవాళ పెట్టిన గోధుమ రవ్వ, ఉప్మా చాలా బాగుంది. ఇప్పటి నుంచి రోజూ ఉదయం టిఫిన్ ఇక్కడే తింటా. మధ్యాహ్నం అన్నం మంచిగా పెడుతున్నారు. రోజుకో కూరతో, పప్పు, సాంబారు కూడా పెడుతారు. ఇంకా టిఫిన్‌లో ఇడ్లి సాంబార్ పెడుతారంట. పూరి, అటుకులు, కిచిడీ కూడా పెడుతారని మా సారు చెప్పారు. కేసీఆర్ సారు బడిలో టిఫిన్ పెడుతున్నరని మా అమ్మకు చెప్తా. థాంక్యూ సీఎం సార్.
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమానికి మా పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మా పాఠశాలలో వంద మందికి పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో కొన్నిసార్లు ఉదయం తినకుండానే వస్తున్నారు. దీంతో తరగతి గదిలో ఇబ్బంది పడేవారు. ప్రభుత్వం టిఫిన్ పెడుతుండడంతో వారికి చాలా మేలు జరుగుతుంది. బడి బయటి పిల్లలను పాఠశాలలకు మళ్లించడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. డ్రాపౌట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పాఠశాలకు నిర్ణీత సమయానికి పిల్లలు రావడానికి ఆస్కారముంటుంది. పిల్లలకు బలవర్థకమైన అల్పాహారం అందిస్తే తరగతి గదిలో ఉత్సాహంగా ఉంటారు. పాఠాలు శ్రద్ధగా విని చదువులో రాణించగలుగుతారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాలు సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతాయి. పేద విద్యార్థుల ఆకలి తీర్చే పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
మా పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం అందించే స్థోమత మాకు లేదు. రాత్రి వండిన అన్నమే ఉదయం పోపు వేసి లేదా ఏదో ఒక పచ్చడి వేసి పెట్టి బడికి తోలుతున్నాం. దీంతో పోషకాహార లోపంతో పిల్లల్లో సరిగా ఎదుగుదల ఉండడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించడం సంతోషకరం. ఈ పథకం పేద విద్యార్థులకు వరం. ఈ ఆహారంతో పిల్లల్లో ఏకాగ్రతతోపాటు మంచి ఎదుగుదల ఉంటుంది. 1నుంచి 10వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందించడం గొప్ప విషయం. ఇలాంటి భోజనం అందించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతారు.