రాజాపేట, డిసెంబర్ 2 : అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన విద్యార్థి రాజాపేట సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. అతడిపై ఇంటర్ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి క్రికెట్ బ్యాట్, వికెట్లతో దాడి చేశారు. విద్యార్థిని చితకబాదుతున్న దృశ్యాలను తోటి విద్యార్థి సెల్ఫోన్లో చిత్రీకరించి ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇంస్టాగ్రామ్లో చూసిన బంధువులు విద్యార్థి తల్లిదండ్రులకు తెలపడంతో వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఇంత పెద్దఎత్తున దాడి జరిగినా విద్యార్థి తల్లిదండ్రులకు తెలపకపోవడంతో వారితోపాటు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయులను మూడు గంటలపాటు నిలదీస్తూ దాడి చేసిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గురుకులంలో ఉత్తమ బోధన అందిస్తారని నమ్మి మా కుమారుడిని పంపించామని, ఇంత దారుణంగా సీనియర్ విద్యార్థులు దాడి చేస్తే ఉపాధ్యాయులు పట్టించుకోలేదని ఆరోపించారు. పాఠశాలలో పర్యవేక్షణతోపాటు, క్రమశిక్షణ పూర్తిగా లోపించడంతోటే ఇలా విద్యార్థులు బరితెగించి తోటి విద్యార్థులపై దాడి చేస్తున్నారన్నారు. మా విద్యార్థిని ఐదో తరగతిలో చేర్పించినప్పుడు అప్పట్లో గురుకుల వ్యవస్థ కార్పొరేట్ స్థాయిలో కొనసాగిందని, ఇప్పుడు గురుకుల వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. మా బిడ్డకు ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. ఘటన జరిగిన సమయంలో తాను సెలవుల్లో ఉన్నానని ప్రిన్సిపాల్ తెలిపారు. తమ దృష్టికి రాగానే, విద్యార్థిపై అకారణంగా దాడి చేసిన ఏడుగురు ఇంటర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు.