మునుగోడు, మే 05 : కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే జెండా సీఐటీయూ జెండా అని సీఐటీయూ మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అన్నారు. సోమవారం మే డే వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ పథకాలు అందించకుండా, కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా పరిపాలన సాగిస్తున్నాయని విమర్శించారు.
కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మిర్యాల భరత్, యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, జీడిమడ్ల సైదులు, నూకల పెద్దమ్మ, అండాలు, అరుణ, పెరమళ్ల రాజు, వేముల విజయ్, పావని, సంపూర్ణ, యాదమ్మ, దుర్గయ్య పాల్గొన్నారు.