సర్వమత సారాంశం మానవత్వమేనని.. శాంతి, సహనాలే అభివృధ్ధికి సోపానాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సహనాన్ని పెంపొందించుకుని మరింత సహృద్భావంతో మెలుగాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థ్ధనలతో ప్రతి ఇంట్లో సౌభాగ్యం నిండాలని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించాలని కోరారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన నాయకత్వంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం లభిస్తున్నదన్నారు. ఆయా ప్రధాన పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించి, అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తుచేశారు. ఏటా పండుగ పూట క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించడంతోపాటు ప్రేమ విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించడం సంతోషంగా ఉందన్నారు.
– సూర్యాపేట టౌన్, డిసెంబర్ 23
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 23 : సర్వ మతాల సారాంశం మానవత్వమేనని.. ప్రతి ఒక్కరిలో ఓర్పు, సహనం పెరిగి ఐక్యతగా జీవించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గవ్యాప్తంగా క్రైస్తవులకు జిల్లాకేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో పాపాలను పారద్రోలి ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలన్నారు. ప్రార్థనలతో అన్ని రంగాలూ మరింత అభివృద్ధి చెంది శాంతియుత సమాజంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలందరిలో ప్రేమ, కరుణ పెరిగి ఇతరుల పట్ల స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ పేదలు, అనాధల పట్ల సేవాగుణం కలిగి వారికి అండగా నిలవాలన్నారు. అన్ని మతాలు మానవత్వంగా జీవించడమే నేర్పిస్తున్నాయని వాటిని సక్రమంగా ఆచరణలో పెట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ తన నాయకత్వానికి మానవత్వంగా జీవించడంతో పాటు సేవాగుణం కలిగి ఉండడమే నేర్పించారని.. ఆ దిశగానే నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు నుంచే సర్వమతాల సమ న్యాయం జరగుతుందన్నారు. అన్ని మతాల వారి ప్రధాన పండుగలను ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రతియేటా లక్షలాది మంది పేద క్రైస్తవులకు చీరలు, దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాకులతో పాటు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో అనేక చర్చీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. సమాధుల తోటలు సైతం అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కుల మతాల పండుగలంటే గొడవలు, కొట్లాటలకే పరిమితమయ్యేవని విమర్శించారు. తెలంగాణ వచ్చాక ఎనిమిదేండ్లుగా అన్ని కుల మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లోనూ ఇలాగే శాంతి సహనాలు పెంపొందించుకుని ఐక్యతతో అన్ని రంగాలను మరింత అభివృద్ధిపథంలో నడుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక విందులో క్రైస్తవులకు వడ్డించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జేసీ సంజీవరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జడ్పీటీసీ జీడి భిక్షంతో పాటు ఆయా చర్చీల పాస్టర్లు, క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.