సూర్యాపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలాఖాలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రొటీన్‌కు భిన్నంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ద్వారా మంత్రి జగదీశ్‌రెడ్డి మార్క్ ప్రస్పుటించింది. అనుచరులను ఆత్మీయంగా పలుకరించాలన్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నినాదాలు, జెండాలు ఎటువంటి హడావుడి లేకుండా ఆసాంతం ఓ పెండ్లి వేడుకను, ఓ జాతరను మైమరిపించింది. సమ్మేళనాలకు సకుటుంబ సపరివారంగా హాజరు కావాలంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో గులాబీ దండు తమ ఇడ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో తరలిరావడం విశేషం.
చివ్వెంల, వట్టి ఖమ్మంపహాడ్, ఐలాపురం, అక్కలదేవిగూడెం, గాయంవారిగూడెం, ఎంజీ నగర్‌తండా, మున్యానాయక్‌తండా, పాండ్యానాయక్‌తండా, రాజుతండా, రోళ్లబండ తండా, సూర్యానాయక్‌తండా ప్రజలు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, తనయుడు వేమన్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంత్రి దంపతులతో కలిసి సహఫంక్తి భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌తో మధ్యమధ్యలో వేసవి తాపం నుంచి ఉపశమనానికి మజ్జిగ ప్యాకెట్లు పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన ఫ్యామిలీలు పోటీ పడి ఫొటోలు దిగడంతో కాసేపు ఫొటో షూట్లా మారింది. 2500 నుంచి 3వేల మంది వరకు వస్తారని అంచనా వేయగా.. 5వేలకు పైనే వచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. అందుకనుగుణంగా వెంటవెంటనే ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు.
నిర్మానుష్యంగా మారిన గ్రామాలు
మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఊరూవాడా కదం తొక్కింది. ఉదయం తొమ్మిది గంటలకే కుటుంబమంతా ఇండ్లకు తాళాలు వేసి వెళ్లారు. దీంతో గ్రామాలు మొత్తం బోసిబోయి నిర్మానుష్యంగా కనిపించాయి.
60ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలోనే..
తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధ్ది చెందిందని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యావత్ దేవానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రూ.9వేల కోట్లతో అభివృద్ధి చేశారని, ప్రతి గ్రామానికీ రోడ్లు వేయించి, సకల వసతులు కల్పించారని తెలిపారు. రైతుబంధు ద్వారా నియోజకవర్గ రైతుల ఖాతాల్లో రూ.600 కోట్లు జమ అయినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గతంలో ఏ గ్రామానికి పోయినా కాంగ్రెస్, సీపీఎం నాయకుల గోరీలు, స్థూపాలు కనిపించేవని.. ఇప్పుడు ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంకులు స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. గ్రామాలు, తండాల్లో పచ్చని, ఆహ్లాదకర వాతావరణం, గ్రామగ్రామాన అంతర్గత రహదారులు, మారుమూల తండాల్లో అద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని, అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని కోరారు.
– బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్
ప్రతి పథకం ఆదర్శనీయం
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలు అమలు చేసి దేశంలోనే గొప్ప వ్యక్తిగా సీఎం కేసీర్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిదేనని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాదయాత్రల పేరుతో గ్రామాలు తిరిగినా ప్రయోజనం లేదన్నారు. అభివృద్ధిని చూసి మంత్రిని మూడోసారి గెలిపించుకొని కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
– బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు
కేసీఆర్ సారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలా సక్కబెట్టిన సీఎం కేసీఆర్ సారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. గతంలో ఎన్ని సార్లు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు కదా.. వస్తదన్న నమ్మకం కూడా లేకుండె. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక పింఛను వస్తుంది. నెలకు రెండు వేలు ఇస్తున్నరు. గతంలో మా ఊర్లో బజార్లన్నీ చీకట్లో గుంతలు గుంతలుగా ఉండేవి. ఇప్పుడన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయి. గిలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలే. పార్టీ నాయకులు కుటుంబాలుగా కలిసి రావడం మేము ఎప్పుడూ చూడలేదు. మేమిద్దరం మా ఇంటికి తాళం వేసి వచ్చినం. ఇక్కడికి వచ్చినంక చూస్తే నిజంగానే మా కుటుంబ సభ్యులను కలిసినంత సంతోషంగా ఉంది. పొద్దుగాల వచ్చిన కానుంచి చుట్టాల ఇంటికి పోతే చూసినంత మర్యాదగా చూసుకున్నరు. అర్ధగంటకోపాలి మంచినీళ్లు ఇచ్చిండ్రు. సల్ల ప్యాకెట్లు ఇచ్చిండ్రు. మటన్ కూరతో అన్నం పెట్టిండ్రు. మంత్రి జగదీశ్‌రెడ్డి సారు సల్లగుండాలి.
– పాలడుగు ఎల్లయ్య, ఈదమ్మ దంపతులు (గాయంవారిగూడెం)