నీలగిరి, నవంబర్ 9 : పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తాడని జనం ఎదురుచూస్తూ.. పైసా ఇవ్వకపోగా, తిట్ల పురాణం పెట్టడం సిగ్గు చేటని జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తే కోట్లాది రుపాయల నిధులు వచ్చేవని గుర్తు చేశారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ పుట్టిన రోజైనా రేవంత్‌రెడ్డి తన బుద్ధి, భాష మార్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మూసీ ప్రక్షాళణ యాత్రలో ఆయన మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు.
దేవుడి సన్నిధి నుంచి వచ్చినా కూడా మూసీ కంటే ఆయన నోరే కంపు అన్న రీతిలో వ్యవహరించారని మండిపడ్డారు. 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకొనేందుకు ఏమీ లేక మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కుర్చీలో కూర్చుని రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష విసమాజానికి ఏం సందేశం ఇస్తున్నదో ఆలోచించుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాదని, కేవలం దాని పేరుతో జరుగుతున్న దోపిడీ కుట్రలపైనే తమ అభ్యంతరమని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తం.. ముక్కలు చేస్తాం… కుక్క చావు చస్తావ్ అంటూ మాట్లాడడం హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా ఉందన్నారు.
హైదరాబాద్ ప్రజలకు వద్దకు వెళ్తే తిరుగబడతారని నల్లగొండకు వచ్చి డ్రామాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మూసీ యాత్ర అంటూ జిల్లాకు వచ్చిన సీఎం ఒక్క హామీ అయినా ఇచ్చారా? ఒక్క పథకానికైనా అదనంగా నిధులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం భాషను చూసి మంత్రులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, కాంగ్రెస్ కార్యకర్తలతో సభను నిర్వహించుకోవడం సిగ్గు చేటన్నారు.
సీఎం స్థాయిని దిగజార్చుతున్న రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం సిగ్గూశరం ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న ప్రేస్టేషన్లో అడ్డగోలు ఆరోపణలు చేశారన్నారు. 11 నెలల పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మేలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్లతో ప్రజల ఇండ్లను కూల్చడం కాదు.. ప్రజలే మీ ప్రభుత్వాన్ని బుల్డోజర్లతో కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో హైడ్రా అలజడి నుం చి ప్రజలను పక్కదారి పట్టించేందుకే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన పాదయాత్ర నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి విమర్శించారు. మధ్యలో ఎక్కడో రెండు కిలోమీటర్లు నడువడం కాదు.. ప్రారంభం నుంచి చివరి వరకు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల ప్రమేయం లేకుండా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని, అప్పుడే ప్రజల స్పందన తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ పేరుతో అక్రమ సంపాదనకు రేవంత్‌రెడ్డి తెరలేపారని ఆరోపించారు. కుల గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయడం కోసం కుటుంబ సర్వే చేస్తున్నారన్నారు.
అరవయ్యేండ్లు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పాపమే మూసీ మురికికి కారణమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. పదేండ్లపాటు మూసీ ప్రక్షాళన కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలతో నేడు ఆ పరిసర ప్రాంతాల భూములు సస్యశ్యామలంగా పండుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాన్నే ఫణంగా పెట్టిన కేసీఆర్‌తో నీకు పోలికా.. కేసీఆర్ మాట ఎత్తే అర్హత కూడా నీకు లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ఘాటుగా విమర్శించారు. మంత్రి పదవి ఎక్కడ ఉడిపోతుందోననే భయంతో సీఎం మెప్పు కోసం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇదే కోమటిరెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ రాష్ర్టానికి దిక్సూచి అని గొప్పగా పొగడలేదనా అని ప్రశ్నించారు.
ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతేంటో ప్రజలకు చెప్పాలన్నారు. వాటి అమలు చేయకుంటే ప్రజలు రోడ్ల మీద తిరుగనివ్వరని హెచ్చరించారు. సమావేశంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీపీ కరీంపాష, నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, మెరుగు గోపినాథ్, మాజీ ఎంపీటీసీ సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కడారి కృష్ణయ్య, కొండూరు శంకర్, విద్యార్ధి నాయకులు కట్ట శ్రీను బోమ్మరబోయిన నాగార్జున, గంజి రాజేందర్, షబ్బీర్ పాల్గొన్నారు.