నకిరేకల్ : కాంగ్రెస్ నాయకుల మాయమాటలతో తెలంగాణ ప్రజానీకం మోసపోయింది. ప్రజా అవసరాలు తీర్చాలనే ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయి లేదు, యూరియా సరఫరా చేసే తెలివి లేదని మండిపడ్డారు.
రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత రాలేదన్నారు. యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతుల ముందు వెళ్లి నిలబడితే మీ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు చెప్పులతో కొడతారన్నారు. గత 10 సంవత్సరాలలో
ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఉన్నంత భూమే ఇప్పుడు ఉంది.
అప్పుడు వేసిన పంటలే ఇప్పుడు వేసినా యూరియా కొరత ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత లేదు అని సిగ్గులేకుండా సీఎం ప్రచారం చేస్తున్నాడు. వేలమంది రైతులు రోజుల తరబడి యూరియా కోసం తల్లడిల్లుతుంటే రాష్ట్రంలో అసలు యూరియా కొరత లేనట్లు, కృత్రిమ కొరత సృష్టించారని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే యూరియా ఇవ్వండి. లేదా రాజీనామా చేయాలన్నారు.