నకిరేకల్, మే 15: ‘కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లోనే భగీరథ్‌ను దాచిపెట్టారనే అనుమానం వస్తోంది. బండి సంజయ్‌కు, రేవంత్‌రెడ్డికి ఉన్న ఫెవికాల్ బంధమే చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బాలికను లైంగికంగా వేధించిన పోక్సో కేసులో నిందితుడు సాయి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అతని కుమారుడు బండి భగీరథ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే వెంటనే బండి సంజయ్‌ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు భగీరథ్‌ను అరెస్టు చేసి బాలిక కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలబడాలన్నారు. బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే మహిళలు సీఎం రేవంత్‌రెడ్డికి సమాధి కడతారని హెచ్చరించారు.
ఏడు రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీకి కాంగ్రెస్ బీటీమ్‌గా పని చేస్తోందన్నారు. బండి సంజయ్‌కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, సీఎం రేవంత్‌రెడ్డి అండగా ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించి, న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు.
మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో, నారీ శక్తి సమ్మాన్ అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు ఇలాంటి ఘటనలపై తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, నకిరేకల్, కేతెపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, సీనియర్ నాయకులు పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, రావిరాల మల్లయ్య, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, నాయకులు దైద పరమేశం, ముక్కాముల శ్రీనివాస్, జిల్లా సంపత్, బి. ప్రసాద్, ఎమ్‌డి అఖిల్, జనార్దన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.