కొండమల్లేపల్లి, ఆగస్టు 16 : బొలెరో వాహనం ఢీకొని నాలుగేండ్ల బాలిక అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధి కొలుముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ బాపూజీ నగర్ వద్ద (జాతీయ రహదారి 167) పై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాపూజీ నగర్‌కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. రోజువారి కూలీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అక్షర కొండమల్లేపల్లిలో గల ప్రైమరీ స్కూల్లో చదువుకుంటుంది.
మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు అక్షర తన నానమ్మ కోసం రహదారిపై వేచి ఉంది. ఆ సమయంలో దేవరకొండ నుండి కొండమల్లేపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి చిన్నారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. చిన్నారి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీర రమేశ్ తెలిపారు.