అనంతగిరి, మే 27 : గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న చెక్ డ్యాములకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం అని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నల్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. అతి భారీ వర్షాల కారణంగా చనుపల్లిలో చెక్‌డ్యాంకు పెద్ద ఎత్తున గండ్లు పడి పంటలు కొట్టుకుపోయి భారీ నష్టం జరిగిందన్నారు. ఆ గండ్లకు వెంటనే మరమ్మతులు చేపిస్తాం అని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి యేరు కింద ఉన్న రైతులకు మేలు జరిగేలా చెక్ డ్యామ్‌ను పొడిగించి ఆ గండ్లకు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందన్నారు. మాటలేమో కోటలు దాటుతున్నాయి కానీ చేతలేమో శూన్యం అని విమర్శించారు.