నల్లగొండ, ఆగస్టు 5 : జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నాయా ? కాస్ట్లీ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారా? అంటే నిజమే అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తేలిపోయింది. నల్లగొండ పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఇటీవల రైడ్ చేసి తీసిన శాంపిల్స్‌లో నాణ్యత లేదని బయటపడింది.
ఆల్కహాల్ శాతం 42 శాతానికిగానూ 70శాతం ఉన్నది. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న కనకదుర్గ వైన్స్, ప్రజా వైన్స్‌లో ఈ కల్తీ మద్యం దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి స్వాతి రెండు వైన్స్‌ల యాజమాన్యానికి నోటీసులు అందజేసి కేసు ఫైల్ చేశారు. వారికి చాలెంజ్ కింద నెల సమయం ఇచ్చిన తర్వాత చార్జిషీట్ వేస్తామని స్వాతి నమస్తే తెలంగాణకు తెలిపారు.
ఎక్కువ ధర విస్కీలో చీప్ లిక్కర్ కలిపి..
జిల్లాలో విస్కీ రూ.560 నుంచి రూ.1,600 వందల వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్లు వైన్స్‌ల్లో అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్ రూ.560 ఉండగా రాక్ ఫోర్డ్ విస్కీ ఫుల్ బాటిల్‌కు రూ.1600 వరకు ఉంటుంది. విస్కీల్లో అధిక ధర విస్కీ అయిన రాక్ ఫోర్డ్, బ్లెండర్స్ ప్రైడ్, సిగ్నేచర్ లాంటి మద్యం బాటిళ్లలో ఓసీ, ఐబీ లాంటి మద్యం కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా వాటిల్లో 42 శాతం ఆల్కహాల్ శాతం ఉంటుంది.
ఇటీవల ఫుడ్ సేఫ్టీ అదికారులు బ్లెండర్స్ప్రైడ్, ఐకాన్ అనే విస్కీ బాటిళ్లను శాంపిల్స్‌కు పంపగా వాటిల్లో ఆల్కహాల్ శాతం 70 ఉన్నట్లు గుర్తించారు. స్పెషల్ రైడ్‌లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు వైన్ షాపుల్లో తనిఖీలు చేసి శాంపిల్స్ తీసుకెళ్లగా ఆ రెండింట్లోనూ కల్తీ మద్యం ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన జిల్లా కేంద్రంతో పాటు పలుచోట్ల కల్తీ మద్యం జోరుగా విక్రయిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
వైన్స్ పర్మిట్ రూముల్లో ఇష్టారాజ్యంగా ఫుడ్
జిల్లాలో 174 వైన్స్ షాపులు ఉండగా వాటిల్లో యాజమాన్యాలు పర్మిట్ రూములకు అనుమతి తీసుకున్నప్పటికీ ఫుడ్ విక్రయించే నిర్వాహకులు మాత్రం అనుమతి తీసుకోకపోవటంతో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి అందరికీ నోటీసులు జారీ చేశారు. ఆయా సిట్టింగ్ పర్మిట్ రూముల్లో ప్టేట్ పల్లీకి రూ.100, చికెన్‌కు రూ.150, తలకాయ, బోటి, మటన్‌కు రూ.200, చేపకు రూ.100 చొప్పున ఇష్టారాజ్యంగా ధరలు పెట్టి, మద్యం ప్రియులకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వడం లేదని తెలుస్తున్నది. వైన్స్ సిట్టింగ్‌లలో ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని లేదంటే రూ.5లక్షల ఫైన్ విధిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి హెచ్చరించారు.