దామరచర్ల, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న చలో ప్రజా దర్బార్ గ్రామ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ హాజరై విజయవంతం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేశ్ నాయక్ గురువారం పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే అన్నారు. ఎన్నో ఏళ్లుగా రూ.10, 15 వేల జీతాలతో కుటుంబాలు గడువక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అన్నారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఏజెంట్లను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైమ్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.