అర్వపల్లి, సెప్టెంబర్ 20 : రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు లారీల యూరియా రాగా 170 మంది రైతుల కంటే ఎక్కువగా అధికారులు యూరియా సరఫరా చేయలేకపోయారు. ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులకు మద్దతుగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పోలేబోయిన కిరణ్, పెద్ద లింగయ్య ధర్నాలో కూర్చొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి దుకాణాల ముందు నిలపడుతున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని దుయ్యబట్టారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఏసీ బంగ్లాలలో, ఏసీ కార్లలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ, రైతు బంధు, సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడంలో విఫలం చెందిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అవసరమైన యూరియా అందించడంలో కూడా పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రోజుల తరబడి సొసైటీ, ఆగ్రోస్ వద్ద నిల్చోని విసుగు చెందిన రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముందస్తుగా యూరియా అంచనా వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. దీని మూలంగా పంట పండించే రైతులకు తీవ్ర నష్టం ఎదురవుతుందని, తక్షణమే యూరియా అందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సంపత్ కిరణ్, కేలోతు రవీందర్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.