అనంతగిరి, ఏప్రిల్ 12 : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాల్గొవ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగ, వ్యవసాయ కూలీల జీవితాలను ధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. వ్యవసాయానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిందని, పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రతి బడ్జెట్లోనూ నిధుల కోత విధించి మెల్లిమెల్లిగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు తప్పనిసరిగా రూ.307 చెల్లించాలని చట్టం చేసిందని, కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రూ.200 మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఉపాధి పనికి రూ.350 తప్పనిసరిగా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, కొలతలతో సంబంధం లేకుండా రూ.700 వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌ను పరిశీలించాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు అందడం లేదన్నారు. మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పనిముట్లు, మెడికల్ కిట్, టెంట్లు వంటి సౌకర్యాల కోసం వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన పేర్కొన్నారు.
మహాసభకు రెమిడాల రాజు అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, బత్తినేని హనుమంతరావు, మండవ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, చిoత్రియాల రవి, నీలం నాగభద్రం, బత్తిని గౌడ్, వీరబాబు, లాల్సాబ్, నూకల శ్రీనివాస్ పాల్గొన్నారు.