నల్లగొండ, ఆగస్టు 26 : రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు, రైతుల గోడు పట్టదా అని సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరతకు ఎవరు కారకులో అందరికీ తెలిసినా, పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 9 వేల లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉండగా నామమాత్రంగా సరఫరా చేసిందన్నారు. నల్లగొండ జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని జిల్లా వ్యవసాయ అధికారులు గుర్తిస్తే, ఇప్పటివరకు కేవలం 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా జరిగిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన కోటాను తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేస్తుందని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసి కృత్రిమ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగం రోడ్డెక్కి పాస్ బుక్స్, ఆధార్ కార్డులు, చెప్పులు పెట్టి క్యూ లైన్లు కడుతుంటే, రైతులకు సరఫరా యూరియా అందించకుండా ఒకరికి ఒక బస్తా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని 5 నుండి 10 ఎకరాల పంటలకు ఒక యూరియా బస్తా ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. యూరియా కొరతతో నల్లగొండ జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఒకవైపు వర్షాలు పడుతుంటే యూరియా లేకపోవడంతో సేద్యం చేసిన పంటలు తగిన దిగుబడి రావన్నారు. రామగుండం యూరియా కంపెనీ ఉత్పత్తిని ఆపేసిందని ప్రచారం జరుగుతుంది, ఎందుకు ఆపేసిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాలు కారణమని ఒకరి మీద ఒకరు సాకులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను ఇప్పించడంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ శ్రేణులు గల్లీలో కాదు ఢిల్లీలో ధర్నాలు చేయాలన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను రైతులకు అందించాలని కోరారు. ఇప్పటికైనా స్పందించి సకాలంలో యూరియాను సరఫరా చేయకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారీ ఐలయ్య, డి.మల్లేశ్, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, ఎండీ సలీం, పి.నర్సిరెడ్డి, దండంపెల్లి సత్తయ్య, బొజ్జ చిన్న వెంకులు, వెంకట రమణారెడ్డి, జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, పి.వరలక్ష్మి, జిట్టా సరోజ, కొండ అనురాధ, వెంకన్న, వినోద్ నాయక్, సైదులు, మల్లయ్య, శ్రీనివాస్, మల్లం మహేశ్, గంజి మురళీధర్, పద్మ, రవి, నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, మధు పాల్గొన్నారు.
Nalgonda : రైతుల గోడు పట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : తుమ్మల వీరారెడ్డి