రైతులు పండిస్తున్న తెల్లబంగారం చేతికి వస్తుండడంతో మోసాలతో కొనుగోలు చేసే దోపిడీ దొంగలు తయారవుతున్నారు. 25 కిలోలు గానీ, 50 కిలోలు గానీ.. ఒక్కసారి కాంటాపై బస్తా పెడితే ఏడు నుంచి పది కిలోల పత్తిని మాయ చేస్తున్న ఘనులు వాళ్లు. సాధారణంగా కాంటా వేసే సమయంలో బాట్లు, కాంటావైపే రైతులు చూస్తారు. ఇక్కడ కాంటాలో తేడా ఉండదు, బాట్లలో మోసం ఉండదు. దడువాయి హ్యాండ్ మ్యాజిక్‌తో మాయ చేసి రైతులకు కుచ్చుటోపీ పెడతారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పత్తి పంట చేతికి వస్తుండగా పది రోజుల క్రితమే కలెక్టర్ సమావేశం పెట్టి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇప్పటికీ తెరుచుకోలేదు.
ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టపడి పంటను తీసే రైతులకు తీరా మార్కెట్‌కు చేరుకునే సరికి మోసం జరుగుతున్నది. జిల్లాలో పంట దిగుబడి ప్రారంభం కాగా, అప్పుడే దోపిడీకి తెరలేచింది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఆంధ్రాకు చెందిన ఒకరిద్దరు స్థానికంగా కొంతమంది వ్యాపారులతో లింకులు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో ఏజెంట్లను తయారు చేసుకున్నారు. వారి ద్వారా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 ఉండగా, రూ.6,500 నుంచి 7వేలకు ఇంటి దగ్గరే కొంటామని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రవాణా, ఇతరత్రా ఖర్చులు లేకుండా మంచి ధర ఇస్తున్నామని నమ్మబలికి రంగంలోకి దిగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు మోసం అంతా కాంటాలు వేసేప్పుడే జరుగుతున్నది. కాంటా వేసే సమయంలో ఒక బస్తా 25 కిలోల నుంచి 50 కిలోల వరకు ఎంత ఉన్నా ప్రతి బస్తాకు 7 నుంచి 10 కిలోల పత్తిని మాయ చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కసారి బస్తా కాంటా ఎక్కించి దింపితే రూ.530 నుంచి 750 వరకు రైతులను దోచుకుంటున్నారు. ఇలా కాంటాలో మోసం చేసేందుకు హ్యాండ్ మ్యాజిక్‌పై పట్టున్న దడువాయిలను ఎంచుకోవడం, లేదంటే తర్ఫీదు ఇచ్చి నియమించుకోవడం జరుగుతున్నది. అత్యంత వేగంగా కాంటాపై బస్తా పెట్టి అదే వేగంతో బస్తా ఉన్న వైపు ముందుకు నెట్టి ఇన్ని కేజీలు అయ్యాయని వెంటనే బస్తాను తొలగించి లారీల్లోకి ఎక్కించడం చేస్తున్నారు. చివ్వెంల మండలం గుంజలూరులో గత సోమవారం ఓ దళారీ ఇలాంటి మోసానికి పాల్పడగా, రైతులకు అనుమానం వచ్చి లోడ్ చేసిన పత్తి బస్తాలను కిందికి దింపి తిరిగి కాంటాలు వేయించడంతో మోసం బయటపడింది. ఒక్కో బస్తా ముందుకు, ఆ తర్వాతకు 7కిలోల వరకు తేడా రావడంతో రైతులు అతడికి పత్తి అమ్మకుండా వెనక్కి పంపించేశారు. ప్రభుత్వం గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి పత్తి కొనుగోళ్లు చేపడితే ఇలాంటి మోసాలకు తావు ఉండదని ఇక్కడి రైతులు వాపోతున్నారు.
రైతులు పండించిన పత్తి కొనుగోళ్లలో దోపిడీలో గ్రామాల్లో దళారులతో పాటు సీసీఐ కొనుగోలుదారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు తమ పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్తే ‘మాయిశ్చర్ ఉంది. పత్తి రంగు మారింది. ఎకరాకు 5 లేదా 6 కింటాల వరకే కొనుగోలు చేస్తాం. పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు కావాలి’ అంటూ నానా కొర్రీలు పెట్టి తీరా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారని రైతులు వాపోతున్నారు. అదే దళారులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తే కొర్రీలు పెట్టకుండా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తారనే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు గ్రామాల్లోనే దళారులకు పత్తి విక్రయిస్తున్నారు. ఇలా సీసీఐ, దళారులు కుమ్మక్కై ఒక్కో సీజన్లో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల దోపిడీ చేసి వారు తీసుకొని, సహకరించే అధికారులకు ఇంత పంచుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే గ్రామాల్లో దళారులు కొనుగోలు ప్రారంభించగా, కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించినా ఇప్పటికీ అతీగతీ లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో దళారుల బెడదను అరికట్టడంతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అధికారులు సరైన పర్యవేక్షిస్తూ రైతులకు మద్దతు ధర ఇప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.