నల్లగొండ, అక్టోబర్ 13 : వానకాలం సీజన్లో రైతు పండించిన తెల్లబంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇప్పటికే రెండు పికింగ్స్ పత్తి చేతికి వచ్చినప్పటికీ సీసీఐ కేంద్రాలు ప్రాంరంభించ లేదు. పెట్టుబడి ఖర్చులు, అప్పుల బాధ తట్టుకోలేక రైతులు పత్తిని తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 పలుకుతుండా గ్రామాల్లో ఇప్పటికే తిష్ట వేసిన దళారులు నాణ్యత, తేమ పేరుతో క్వింటాకు రూ.6,000 నుంచి రూ.6 300 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దాంతో రైతులు క్వింటాకు రూ.1200 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. అయితే జిల్లాలో పత్తి కొనుగోలు చేయడానికి 23 జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు టెండర్లల్లో పాల్గొనగా పత్తి కొనుగోలు చేసే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మాత్రం వారిని ఇప్పటివరకు నోటిఫై చేయలేదు. దాంతో మార్కెటింగ్ యంత్రాంగం కూడా చేతులు ముడ్చుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో పత్తి రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు.
సాధారణంగా ఏటా సెప్టెంబర్ నుంచి పత్తి పంట తొలి పికింగ్ షురూ కానుండగా అక్టోబర్ ఫస్ట్ నుంచి సీసీఐ కేంద్రాలు పత్తి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తాయి. గతేడాది మద్దతు ధర కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో సీసీఐ కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఈ సారి సాగు పెరుగడంతోపాటు పంట ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తున్నందున మద్దత ధర కంటే మార్కెట్లో తక్కువగా ఉంది. దీంతో సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నప్పటికీ సీసీఐ ప్రతినిధు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా సీసీఐ ఒత్తిడి తేవడంలో విఫలమైంది.
నల్లగొండ జిల్లాలో 5,45, 251 ఎకరాల్లో పత్తి సాగు కాగా 3.56 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి రానున్నది అధికారుల అంచనా. గతేడాది కంటే ఈ సారి పత్తి దిగుబడి ఎక్కువ రానుండడంతో త్వరగా సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ సైతం ఆదేశించారు. దాంతో 23 జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు టెండర్లలో పాల్గొన్నారు. వీటిని గుర్తించడంలో సీసీఐ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. సీసీఐ నోటిఫై చేస్తేనే మార్కెటింగ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ఈ సీజన్‌కు సంబంధించిన పత్తి ఇప్పటికే ఒకటి రెండు పికింగ్స్ పూర్తి కావడంతో రైతులు విక్రయానికి సిద్ధమయ్యారు. సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సి వస్తున్నది. అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడులు పెట్టడం, వాటికి వడ్డీలు పెరుగడం వల్ల రైతులు పత్తిని నిల్వ చేసుకునే పరిస్థితులు లేవు. ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తి రూ.6,521 ఉండగా దళారులు మాత్ర రూ.6,00 నుంచి రూ.6300 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు అంటున్నారు. పైగా క్వింటాకు రెండు కేజీలు తరుగు కూడా తీస్తున్నట్లు చెప్తున్నారు. సీసీఐ కేంద్రాలు లేకపోవడం, అందులో విక్రయించినా డబ్బులు ఆలస్యంగా వస్తాయని రైతులు తక్కువ ధరకైనా దళారులకు అమ్ముతున్నారు.
జిల్లాలో పత్తి కొనుగోలు చేయడానికి 23జిన్నింగ్ మిల్లుల నుంచి టెండర్లు వేయగా, వాటిని నోటిఫై చేయాలని సీసీఐని ఫోర్స్ చేస్తున్నాం. నోటిఫై చేయగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. గ్రామాల్లో తక్కువ ధరకు పత్తి విక్రయిస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. కానీ రైతులు తొందర పడి విక్రయించి నష్టపోవద్దు. 8శాతం తేమతో తీసుకొస్తే మద్దతు ధర ఇస్తాం. ఆ తర్వాత తేమ 12శాతం వరకు పెరిగినా తీసుకుంటాం. కానీ ఒక్కో శాతానికి ధర ఉంటుంది.