కట్టంగూర్, నవంబర్ 07 : పాడి రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని పశు వైద్యాధికారి, గాలికుంటు టీకా నల్లగొండ జిల్లా మానిటరింగ్ అధికారి నీరజ అన్నారు. శుక్రవారం కట్టంగూర్, సత్యనారాయణపురం, పరడ, మల్లారం గ్రామాల్లో కొనసాగుతున్న గాలికుంటు టీకా కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి పాడి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాలికుంటు టీకా వేయించడం వల్ల పశువుల్లో వ్యాధి నివారణ తీవ్రతను తగ్గించడంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.
పశువుల్లో పాల ఉప్పత్తి సామర్థ్యం తగ్గకుండా టీకా పని చేస్తుందన్నారు. 4 నెలలు పైబడిన వాటికి తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా 7వ విడుత టీకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు పశువులకు టీకా వేయడం జరుగుతుందని, ఈ నెల 14 వరకు టీకా కార్యక్రమం ఉంటుందని అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్, పరడ పశు వైదాధికారులు రవికుమార్, శ్రావణి, ఎల్ఎస్ఏ అరుణ, ఓఎస్ కిరణ్. గోపాలమిత్రలు చెరుకు శ్రీనివాస్, కావాటి యాదగిరి పాల్గొన్నారు.